పరీక్షలు ముగిసిన నెల రోజుల్లోపే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలను వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ చెప్పారు. మే 6వ తేదీనుంచి మొదలవుతున్న పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, కరోనా దృష్ట్యా విద్యార్థులకు చాయిస్ ఆధారిత ప్రశ్నలను పెంచామని ఆయన ఆంధ్రప్రభకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఇందులో 4 లక్షల 59వేల 242 మంది ప్రథమ సంవత్సరం, 4 లక్షల 42వేల 770 ద్వితీయ సంవత్సరం విద్యార్థులని చెప్పారు.
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు 1443 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు మరో అవకాశం కల్పించామని ఏదైనా కారణంతో విద్యార్థులు ఫీజులు చెల్లించకపోతే వెంటనే ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు. విద్యార్థులు పూర్తి స్థాయిలో పరీక్షలకు సిద్ధం కావాలని ఎటువంటి ఒత్తిళ్లకు లోను కావొద్దని సూచించారు. ఒత్తిళ్లకు గురైతే ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాటు చేసిందని ఇప్పటికే మానసిక నిపుణుల ఫోన్ నెంబర్లను ప్రకటించామని విద్యార్థులు వారికి ఫోన్ చేసి ఉన్న ఇబ్బందులను చెబితే పరిష్కరిస్తారని ఆయన చెప్పారు.
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్ మూల్యాంకనం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి జవాబు పత్రాలను ఆన్‌లైన్ ద్వారా మూల్యాంకనం చేసేందుకు చర్యలు తీసుకుంటామని జలీల్ చెప్పారు. ఈ మూల్యాంకనానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని అక్కడి నుంచి నిర్ణయం వెలువడగానే ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మే 18వ తేదీతో వార్షిక ముఖ్య పరీక్షలన్నీ పూర్తవుతున్నాయని అంతకన్నా ముందే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. మే 10వ తేదీలోపు పరీక్ష ఫలితాలను వెల్లడించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎంసెట్ కన్నా ముందే ఇంటర్ ఫలితాలను వెల్లడిస్తామని, ఫలితాలు వచ్చిన నెల రోజుల్లోనే సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఏడాది అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షతో పాటు రీ వ్యాల్యూయేషన్, రీ కౌంటింగ్ ఉంటుందని విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
తరగతులు ప్రారంభానికి ముందే అనుబంధ గుర్తింపు
రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్, ఆన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలకు ఇంటర్ తరగతులు ప్రారంభానికి లోపే అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తామని జలీల్ చెప్పారు. కరోనా కారణంగా కళాశాలల తనిఖీలను నిలిపివేశామని ఈ ఏడాది ప్రతి కళాశాలకు వెళ్లి యాజమాన్యం కల్పించిన మౌలిక, వసతి సౌకర్యాలను పరిశీలించాకే అనుబంధ గుర్తింపు ఇస్తామని చెప్పారు. యాజమాన్యాలు అనుబంధ గుర్తింపుకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని ఇంటర్ బోర్డు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హైకోర్టు నిబంధనల ప్రకారం బహుళ అంతస్తుల భవనంలో కళాశాలలను నిర్వహిస్తుంటే అటువంటి యాజమాన్యాలు అగ్నిమాపక శాఖ ద్వారా సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుందని లేని పక్షంలో కళాశాలలకు గుర్తింపును ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎంసెట్, నీట్, జేఈఈకి హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని త్వరలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం వెలువడుతుందని ఆయన చెప్పారు. ఒకేషనల్ ఇంటర్మీడియట్ కోర్సుల్లో మార్పులు చేర్పులు చేపట్టాలని నిర్ణయించినట్టు జలీల్ చెప్పారు. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు వెంటనే ఉపాధి అవకాశాలు దక్కేలా సిలబస్‌ను మారుస్తున్నామని పేర్కొన్నారు.
నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు
ఇంటర్ వార్షిక పరీక్షలు పూర్తి నిఘా నీడలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు రెండు డోసుల వ్యాక్సినేషన్ టీకా తీసుకుని ఉండాలని ఇప్పటికి తీసుకోకపోతే వెంటనే దగ్గర్లోని ప్రాథమిక కేంద్రానికి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మాస్ కాపీయింగ్, ఇతర అక్రమాలకు తావు లేకుండా ప్రతి పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా పరీక్షల కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతిరోజూ పరీక్షకు అరగంట ముందు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లు, చీఫ్ సూపరింటెండెంట్లు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ భద్రపరిచిన ప్రశ్నాపత్రం బండిల్‌ను తీసుకుని వెళ్లాలని ఎంపిక చేసిన కోడ్ ప్రశ్నాపత్రాన్నే ఇవ్వాలని ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని లేని పక్షంలో సంబంధిత అధ్యాపకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాయిస్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఇస్తున్నందున విద్యార్థులు గమనించి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ ఏడాది కూడా ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజ్ విధానాన్ని అమలు చేయరాదని నిర్ణయించినందున విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి తీసుకురావొద్దని సూచించారు.