సీఎం కేసీఆర్ ప్రచార ఆర్భాటంలో భాగంగా అబద్ధాలు చెబుతున్నారని మాజీ టీ.పీసీసీ అధ్యక్షుడు పోన్నాల లక్ష్మయ్య అన్నారు. జూన్ 10న కాళేశ్వరం మేడిగడ్డ నుంచి పంపింగ్ స్టార్ట్ చేశారని, నిన్నటి వరకు ఎల్.ఎమ్.డీకి చేరిన నీరు కేవలం 11 టీఎంసీలేనని చెప్పారు. మేడిగడ్డ నుంచి పంపింగ్ చేసింది మాత్రం 30 టీఎంసీలని తెలిపారు. రోజుకు మూడు టీఎంసీలు పంపింగ్ చేస్తామని చెప్పి.. కేవలం ఒక్క టీఎంసీ మాత్రమే పంపింగ్ చేస్తున్నారని విమర్శించారు.
గతేడాది లిఫ్ట్ చేసిన ఒక్క చుక్క కూడా రైతాంగానికి ఉపయోగపడలేదన్నారు. సోషియో ఎకనామిక్ సర్వేలో.. కాళేశ్వరం వల్ల నో యూజ్ అని స్పష్టం చేసిందన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసిన ఎకరం భూమికి నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా జల వివాదాలతో చిచ్చు పెట్టి రాజకీయం చేస్తున్నారని పోన్నాల మండిపడ్డారు. ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు వరద జలాల కోసమే పోతిరెడ్డిపాడు విస్తరణ జరిగిందన్నారు. వరద జలాల మీద ఆదారపడి అప్పట్లో పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా- సుజల స్రవంతి, వెలిగోడు, తెలంగాణలోని కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఎస్.ఎల్.బి.సీ నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు.