Saturday, November 23, 2024

అవినీతిలో కేసీఆర్ నెంబర్ వన్ః వివేక్

అవినీతిలో తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నారని బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. హుజురాబాద్ లో ఓట్ల కోసమే ఇష్టం వచ్చిన స్కీంలు పెడుతున్నారని, కేవలం అవినీతి కోసమే కొత్త స్కీములు పెట్ఠి కమిషన్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ అబద్దాల ముఖ్యమంత్రి అని విమర్శించారు. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి గెలిచిన తర్వాత సీఎం ఫాం హౌస్ నుంచి  బయటకు వచ్చారని అన్నారు. ఉప ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలను మర్చిపోతున్నారని మండిపడ్డారు. సీఎం ప్రజలను కలవాలంటే హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ను గెలిపించాలన్నారు. ఈటల రాజీనామా చేస్తేనే ఎన్నో లాభాలు జరిగాయని, గెలిస్తే జరగవా? అని పేర్కొన్నారు.

గతంలో ఎన్నడూ జై భీమ్ అనని కేసీఆర్ ఇప్పుడు ఆ మాట చెబుతున్నారని అన్నారు. గతంలో ఉన్న ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఉన్న పథకంలోనూ కార్లు ట్రాక్టర్లు తీసుకునే వీలుండగా దళిత బంధు కింద ట్రాక్టర్లు కార్లు ఎందుకు? అని ప్రశ్నించారు. సర్వేలన్నీ టిఆర్ఎస్ ఓడిపోతుందని చెబుతున్నాయని అన్నారు. మూడెకరాల భూమి ఇచ్చి ఉంటే దళితుల జీవితాలు ఎంతో మారేవి అభిప్రాయపడ్డారు. జిల్లాల్లో వెయ్యి ఎకరాలకు పైగా భూమి ఉందని, వాటిని తెలియ పరచడం లేదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కింద దోచుకున్న అవినీతి సొమ్ము ఇంటికి పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో 55 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. మల్లన్నసాగర్ లోకి వచ్చే నీరు కాళేశ్వరం నీళ్ళు కాదన్నారు. వర్షం రూపంలో వచ్చిన నీటిని కాలేశ్వరం నీరని చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు.

రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా డిజైన్ చేసిన కాలేశ్వరం ఇప్పటికీ సక్సెస్ కాకపోయినా,  మళ్ళీ మూడో టీఎంసీ పేరిట ప్రజల సొమ్ము వృధా అని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చేసినా పట్టించుకోలేదన్నారు. 42 మంది చనిపోయాక చర్చలకు  పిలిచి.. హామిలిచ్చి మరిచిపోయారని విమర్శించారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మేందుకు సీఎం కుట్ర చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. సింగరేణిలో 60 వేల ఉద్యోగాలుంటే వాటిని 40వేలకు కుదించారని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడం లేదన్నారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికల్లో ఓట్ల కోసమే టీచర్లకు 25 కిలోల బియ్యం ఇచ్చి, తర్వాత మర్చిపోయారని తెలిపారు. హుజురాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలన్నారు. అవినీతి సొమ్ముతో గెలవాలని చూస్తున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రీ డిజైన్ పేరుతో కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. కనీసం ఒక్క టీఎంసీ కూడా సరిగా వాడుకోలేక పోతున్నారు. హుజురాబాద్ లో ప్రచారం చేస్తున్న నాయకులు.. వారి నియోజకవర్గాల్లో మాత్రం ఎలాంటి అభివృద్ధి చేయడం లేదన్నారు. 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు.

కేసీఆర్ అవినీతి పాలన దూరం చేయాలంటే ఈటలను గెలిపించాలని కోరారు. కాళేశ్వర ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగే ముందు.. ప్రాజెక్టు లో జరిగిన అవినీతి బయటకు రావాలన్నారు. కాళేశ్వరం కోసం ఎంత కరెంటు వాడారో? ఎన్ని కోట్లు ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరం అవినీతి పై విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయాలన్నారు. కాళేశ్వరం వల్ల లాభమా? నష్టమా? కరెంటు బిల్లుల భారం ఎంత? అనేది ప్రజలకు చెప్పాలన్నారు. SRSP నుంచి మిడ్ మానేరుకు వచ్చిన నీరంతా కాళేశ్వరం నీరని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల కోసం 36 వేల కోట్లలో 12 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని చెప్పారు. కాళేశ్వరంలో 55 వేల కోట్ల అవినీతి జరిగింది తప్ప ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేకుండా పోయిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement