Saturday, November 23, 2024

తెలంగాణలో పొలిటికల్ హీట్.. ఈటెల చుట్టూ రాజకీయం!

తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోదండరాం గురువారం ఈటల నివాసంలో సమావేశమయ్యారు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణతో పాటు నిర్ణయంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈటల బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీతో ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ వ్యతిరేక శక్తుల మద్దతు కూడగట్టే యోచనలో ఈటల ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇప్పుడు మరోసారి సమావేశం కావడంపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ఈటల కొత్త పార్టీ పెడుతారా? బీజేపీలో చేరుతారా? అసలు ఈటల మనసులో ఏముంది? అన్నది సస్పెన్స్ గా మారింది. మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరకొందరు నేతలు కూడా కాషాయ గూటికి చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. స్వతంత్రంగానే ఉంటానని ఎవరితోనూ కలవబోనని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. హుజురాబాద్లో మళ్లీ పోటీచేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఉపఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీచేస్తానని స్పష్టం చేశారు. మద్దతు కూడగట్టేందుకే ఇతర పార్టీల నేతలను కలుస్తున్నట్లు వెల్లడించారు ఈటల రాజేందర్. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని.. ఊహాగానాలను నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement