మేడ్చల్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భేటీ అయ్యారు. మేడ్చల్‌లోని ఈటల నివాసంలో వీరిద్దరూ కలిశారు. గంట పాటు ఈ ఇద్దరు పలు విషయాలపై చర్చించారు. కాగా, కొండా, ఈటల కలిసి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చర్చించేందుకే ఈటల రాజేందర్ ఇంటికి కొండా వెళ్లారని సమాచారం. కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరి 2018 ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటించలేదు. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈటలను కొండా కలవడంతో ఇద్దరూ కలిసి కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈటల, కొండా విశ్వేశ్వరరెడ్డి తెలంగాణ ఉద్యమంతో పాటు టీఆర్ఎస్లోనూ కలిసి పని చేశారు. ఈటలతో భేటి అనంతరం కొండా మీడియాతో మాట్లాడుతూ, ఈటల రాజేందర్ తనకు పాత మిత్రుడని, ఈటల భార్య జమున తమకు బంధువు అని తెలిపారు. ఒక బంధువుగానే ఈటలను కలిశానని చెప్పారు. బర్త్ రఫ్ వార్త విని సానుభూతి తెలిపానన్నారు. రాజకీయ నాయకుడిగా ఈటల నివాసానికి వెళ్లలేదని, రాజకీయాలు మాట్లాడలేని పేర్కొన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్‌కు అలవాటేనని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు.