మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి (81) గురువారం కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం గుండెపోటురావడంతో తుదిశ్వాస విడిచారు.
ఆయన స్వస్థలం ఉమ్మడి ఆదిలాబాద్‌లోని తలమడుగు మండలం కోదడ్. అక్కడే శుక్రవారం అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన ఆదిలాబాద్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కేబినెట్‌లో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా సేవలందించారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు.
ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. రామచంద్రారెడ్డి ఆదర్శ రాజకీయాలతో స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సందర్భంగా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామచంద్రారెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు