బీజేపీపై విశ్వాసంతో ఈటల రాజేందర్ పార్టీలో చేరారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సోమవారం మాజీ మంత్రి ఈటల రాజేందర్‌లో బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల కమలం కండువా కప్పుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, దిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, అందె బాబయ్య తదితరులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ నియంతృత్వ పాలన నుంచి బయటకు రావాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కాషాయ జెండా పట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణలో ‘గడీల పాలన’ను బద్దలు కొట్టాలని ఈటల నిర్ణయం తీసుకున్నారని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం బీజేపీ అండగా ఉంటుందని, కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. బీజేపీ ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పాలనలో ప్రపంచంలో భారత్ శక్తిమంతంగా తయారవుతోందన్నారు. నడ్డా నేతృత్వంలో బీజేపీ మరింత శక్తిమంతం అవుతోందని బండి చెప్పారు.
ఇక, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ చేరికతో ఆదిలాబాద్‌లో కాషాయం బలపడనుంది. గతంలో రమేష్ రాథోడ్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీలో చేరనుండడంతో ఖానాపూర్‌లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. మొత్తం మీద ఈటల చేరికతో కాషాయ పార్టీ పుల్ జోష్ లో ఉంది. తెలంగాణలో తమకు ఎదురు ఉండదనే ధీమాలో ఉన్నారు ఆపార్టీ నేతలు. మరికొద్ది రోజుల్లో అధికార టీఆర్ఎస్ నుంచి ఇంకా వలసలు ఉంటాయనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల జరిగే వరకు రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి.