చాలా మంది రోడ్డుని దాటాలంటే కన్య్ఫూజ్ అయిపోతుంటారు..మహిళలు..పెద్దవారయితే మరీను. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎంతలా ఉంటుందో అక్కడ వుండేవారికి తెలుస్తుంది..అయితే ఫుట్ పాతలన్నీ కబ్జాలు అవుతుండటం.. చిన్న వ్యాపారాలన్నింటికీ కూడా ఫుట్ పాత్ లే కేంద్రాలుగా మారుతుండటంతో ట్రాఫిక్ సమస్య కత్తి మీద సాములా మారుతోంది. సరిగా పని చేయని సూచికలు… వేగంగా దూసుకొచ్చే వాహనాలను తప్పించుకునే ప్రయత్నంలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. హెల్మెట్ ధరించకుండా ఎంతో మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ పోలీసులు చెబుతుంటారు. అయితే అదేస్థాయిలో రోడ్డును దాటుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా ఎవరూ పట్టించుకోక పోవడం శోచనీయంగా మారుతోంది.
ఇలాంటి సమయంలో ఒక వీడియో అందరికీ కనువిప్పు కలిగించేలా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు మహిళలు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ఒక మహిళ చేతిలో చిన్నారి కూడా ఉంది. ఈ పాదచారులు రోడ్డును దాటేందుకు యత్నిస్తుండగా వేగంగా వాహనాలు అటువైపు దూసుకొస్తూ ఉంటాయి. దీంతో వారు రోడ్డు దాటేందుకు నానా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమయంలోనే ఓ మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి వారిని రోడ్డును దాటేందుకు ప్రయత్నిస్తాడు. ఎట్టకేలకు వారిని రోడ్డును దాటించడంతో మహిళలు హమ్మయ్యా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.