తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భోగి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపుతూ, కొత్త కాంతులు పంచే భోగి మంటలు ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రజా పాలన తెచ్చిన మంచి మార్పులతో అన్ని వర్గాలకు అంతా మంచి జరగాలన్నారు.
రైతు భరోసాను రూ.12 వేలకు పెంచటంతో పాటు వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నగదు సాయం, ఆహార భద్రతను అందించే కొత్త రేషన్ కార్డులు, గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే నాలుగు సంక్షేమ పథకాల అమలుకు సంక్రాంతి పండుగ నాంది పలుకుతోందని అన్నారు. ప్రతి సంక్షేమ పథకం అర్హులైన వారందరికీ చేరాలనేది తన సంకల్పమని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయంతో పాటు ఉపాధి కల్పన, పారిశ్రామిక రంగాలన్నింటా తెలంగాణ రాష్ట్రం తిరుగులేని పురోగమనం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలందరూ సంతోషంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ సంబురాలు జరుపుకోవాలని అన్నారు. పతంగులు ఎగరవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.