జగిత్యాల, ఆంధ్రప్రభ : తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ తెలియజేశారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిరాయింపులని మాట్లాడుతున్నారు. తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ పార్టీలో చేర లేదన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో నిన్నట్నుంచి జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గంగారెడ్డి హత్య బాధాకరమని, ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ హత్యను సీనియర్ కాంగ్రెస్ నాయకుడై ఉండి జీవన్ రెడ్డి రాజకీయం చేయడం బాధాకరమన్నారు. గంగారెడ్డి హత్యకేసులో తన హస్తమున్నదని జీవన్ రెడ్డి మాట్లాడించడం చాలా దురదృష్టకరమన్నారు. ఇవాళ ఫిరాయింపుల రాజకీయాల గురించి మాట్లాడుతున్న జీవన్ రెడ్డీది ఎలాంటి చరిత్రో అందరికీ తెలుసన్నారు.
నాడు కాంగ్రెస్ ను తిడుతూనే రాజకీయాల్లోకి వచ్చిన చరిత్ర జీవన్ రెడ్డిదన్నారు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రై, నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి పార్టీ ఫిరాయించి, ఎన్టీఆర్ ను ఏకాకిని చేసిండన్నారు. స్వాతంత్ర్యం రాక ముందు నుంచే మేం కాంగ్రెస్ వాదులం, కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు కేంద్రబిందువు మా ఇల్లు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే జగిత్యాల అభివృద్ధి చెందుతుందనేదే నా యోచన అని తెలియజేశారు.