అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం
నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 24 (ఆంధ్రప్రభ) : ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ సమస్యలపై వచ్చే ప్రజలకు తెలిసేలా కార్యాలయంలో ఏర్పాటు చేసే సమాచార బోర్డులో అధికారుల పూర్తి వివరాలు ఉండాలి. కానీ ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారుల తీరు ప్రజలకు ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఫుడ్ సేఫ్టీ శాఖ కార్యాలయంలో అధికారి మారి రోజులు గడుస్తున్నా సమాచార బోర్డుపై పేరు మార్చకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. శుక్రవారం కార్యాలయంలో బోర్డుపై పాత అధికారి పేరు ఉండడాన్ని ఆంధ్రప్రభ ‘కెమెరా’ క్లిక్ మనిపించింది.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని ఫుడ్ సేఫ్టీ శాఖా కార్యాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిగా పనిచేసిన టి.నాయక్ బదిలీల నేపథ్యంలో రంగారెడ్డికి జూలై మాసంలో బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎంఏ ఖలీల్ ను నిజామాబాద్ ఫుడ్ సేఫ్టీ ఇంచార్జ్ అధికారిగా నియమించారు. అక్టోబర్ మాసంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ ఇంచార్జ్ అధికారిగా వాసురాం బాధ్యతలు చేపట్టారు. కానీ అధికారి బాధ్యతలు చేపట్టి రోజులు గడుస్తున్నా కార్యాలయంలో సమాచార బోర్డుపై పేరు మార్చలేదు. ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో ఇప్పటివ రకు బోర్డుపై అధికారి పేరు ఎందుకు మార్చలేదు.
ఎప్పటికప్పుడు బోర్డుపై మార్పులు చేయాల్సిన అధికారులు మాకెందుకులే అనుకుంటున్నారా లేదా మార్చలేనంత పనుల్లో నిమగ్నమయ్యారా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో కూడా అధికారి మారినా పేరు మార్చకపోవడంతో ఆంధ్రప్రభ లో వచ్చిన కథనంపై బోర్డుపై పేరును మార్చారు. మళ్లీ అధికారి మారినా పేరు మార్చలేదు. అధికారుల తీరు మారేది ఎప్పుడు.? అంతేకాకుండా ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో కార్యాలయానికి సంబంధం లేని ఇతర వ్యక్తులు కార్యకలాపాలు నిర్వహించడం శోచనీయం.