- 122 మంది రైతులపై కేసు నమోదు..
- వీరిలో 19 మంది మహిళలే..
- పోలీసుల తీరుపై గ్రామస్తుల అసహనం..
- ఆంధ్రప్రభ స్మార్ట్ ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో : నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో 122 మందిపై ఎఫ్ఐఆర్ నమోదయింది. రైతుల ఆందోళనకు దిగివచ్చిన ప్రభుత్వం పరిశ్రమను రద్దు చేస్తున్నట్టు గత నెల 27న ప్రకటించి ఉత్తర్వులు కూడా జారీచేయగా, పోలీసులు ఆందోళనకారులపై కేసులు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. 133 రోజుల ఆందోళన అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీతో చర్చలు కొలిక్కి రావడం రైతులు టపాసులు పేల్చి సంబరాలు కూడా జరుపుకున్నారు. ఆ మరుసటి రోజు దిలావర్పూర్ కు వచ్చిన జిల్లా ఎస్పీ జానకి షర్మిలను గ్రామస్తులు సత్కరించి అభినందించారు.
ఆర్డీవో నిర్బంధం.. డ్రైవర్ ఫిర్యాదుతో కేసులు..
దిలావర్పూర్ లో రైతుల ఆందోళన ఉద్రిక్తకరంగా మారగా, నిర్మల్ ఆర్డీవో రత్న కళ్యాణి గత నెల 26న దిలావర్పూర్ గుండపల్లి గ్రామానికి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. ఆమె కారు దిగకుండానే ఆందోళనకారులు చుట్టుముట్టి దాడికి ప్రయత్నించడం, నాలుగు గంటలు నిర్బంధంలో ఉంచడం, మరోవైపు ఆమె అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కావడం తదితర సంఘటనలు అధికార యంత్రాంగంలో అలజడి రేపాయి. ఆర్డీవో రత్న కళ్యాణి కారు డ్రైవర్ మహమ్మద్ నియాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిలావర్పూర్ పోలీస్స్టేషన్ లో కేసు నమోదు అయింది. దిలావర్పూర్ గుండె పల్లి గ్రామాలకు చెందిన 122 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 307 తోపాటు వేర్వేరు కేసుల్లో పోలీసులు నాలుగు సెక్షన్లు నమోదు చేశారు. కేసులు నమోదైన 122 మందిలో 19 మంది మహిళలు ఉన్నారు.
రైతుల ఆగ్రహం..!
చర్చల సందర్భంగా ఇత్తనాలు ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించడం, పోలీసుల కేసులు ఎత్తివేస్తున్నట్టు ఎస్పీ జానకి షర్మిల హామీ ఇచ్చి తిరిగి ఆందోళనకారులపై కేసులు పెట్టడం పట్ల ఆ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 133 రోజులు నిరవధికంగా ఆందోళనలు చేస్తే ప్రభుత్వం దిగివచ్చి ఇత్తనాలు పరిశ్రమ రద్దు చేసిందని ఇది రైతుల విజయంగా వారు పేర్కొన్నారు. తిరిగి పోలీసులు ఇచ్చిన మాట తప్పి ఆర్డిఓ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు కక్షపూరితంగా కేసులు తిరగదోడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసులు ఎత్తివేయకపోతే తిరిగి ఆందోళన చేయాల్సి వస్తుందని దిలావర్పూర్ గుండ పల్లి గ్రామస్తులు హెచ్చరించారు.