నిర్మల్ ప్రతినిధి : దిలావర్ పూర్ – గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ ప్యాక్టరీ ఏర్పాటు వద్దు అంటూ ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ తరపున సంఘీభావం ప్రకటిస్తున్నామని మాజీ మంత్రి కల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన నివాస గృహంలో విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. రైతులపై జరిగిన లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. లేకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందన్నారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే పచ్చటి పంట పొలాల మధ్య ఇథనాల్ ప్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందన్నారు.
పరిశ్రమ ఏర్పాటుకు ముందు తమతో కానీ, రైతులతో కానీ కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. 24-02- 2023న కేంద్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించకుండా నేరుగా అనుమతులు మంజూరు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతుల తర్వాతే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి 23-06-2023 తర్వాత పర్యావరణ అనుమతులు మాత్రమే మంజూరు చేసిందన్నారు. దీంట్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రమేయం ఏమి లేదన్నారు. అనుమతుల మంజూరు అంతా కేంద్ర పరిధిలో ఉంటుందన్నారు. ఎన్నికల తర్వాత ఇథనాల్ ప్యాక్టరీ పనులు ఎందుకు ప్రారంభించారో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు.
దీని వెనుక ఎవరున్నారో రైతులు గ్రహించాలని కోరుతున్నానన్నారు. ఇథనాల్ ప్యాక్టరీ గుండపల్లిలో ఏర్పాటు చేయడానికి మహేశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులే అన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చేసిదంతా వాళ్లు చేసి తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలన్నారు. పరిశ్రమ రద్దు లేదా తరలింపు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, దీనిపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒకరిపై ఒకరు రాజకీయంగా బురదజల్లుకోవడం మాని… రైతులకు అండగా నిలుద్దామని కోరుతున్నట్లు తెలిపారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ దీనిపై పోరాటం చేస్తుందన్నారు. పచ్చటి పంట పోలాల మధ్య నుంచి పరిశ్రమను తరలించాలని, అప్పటి వరకు తాము రైతుల వెంట ఉంటామన్నారు.