Friday, November 22, 2024

Errabelli – స్వ‌చ్చ‌మైన గాలి, ప‌చ్చ‌ద‌నం, ఆరోగ్య‌క‌ర ప‌రిసరాలు అందించ‌డ‌మే హారితాహారం ల‌క్ష్యం ..

సాలకుర్తి – తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ హరితోత్సవం కార్యక్రమం పాలకుర్తి నియోజకవర్గం లో ఘనంగా నిర్వ‌హించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో,ఆ తర్వాత వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారమ్ చెరువు శిఖంలో అటవీ శాఖ నిర్వహించిన తెలంగాణ హరితోత్సవంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంపద వనంలో సామూహికంగా మొక్కలు నాటారు.

వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే తీసుకున్న అత్యంత ప్రాధాన్యతా పథకాల్లో తెలంగాణకు హరితహారం ఒకటి అని అన్నారు.. మన వారసులకు, రానున్న తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్ఛమైన గాలిని, నివాస యోగ్యమైన ప్రకృతి పరిసరాలను అందించాలనే గొప్ప సంకల్పమే హరితహారానికి పునాది. ఇలా ఆలోచించటంతో పాటు, ఆ దిశగా ప్రజలను ఒక సామాజిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కి దక్కిందన్నారు.

“2015-21 మధ్య రాష్ట్రంలో ఫారెస్ట్ కవర్ 6.85 శాతం పెరిగింది. ఇది 3 లక్షల 36 వేల ఎకరాలకు సమానం. అదే సమయంలో రాష్ట్రంలో పచ్చదనం (గ్రీన్ కవర్) 7.70 శాతం పెరిగిందని మంత్రి వివరించారు. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 273 కోట్ల 33 లక్షల మొక్కలు నాటాం. రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల 864 నర్సరీల ఏర్పాటు చేశాం. హరితహారం నిర్వహణ కోసం ఇప్పటిదాకా 10 వేల 822 కోట్ల వ్యయం చేశాం. 19 వేల 472 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు. (13 వేల 657 ఎకరాల్లో), 2 వేల 11 బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటు (6 వేల 298 ఎకరాల్లో) జరిగింది. రాష్ట్రం అంతటా 1 లక్ష 691 కిలో మీటర్ల మేర రహదారి వనాలు వేశాం. ఇందులో 12 వేల కిలోమీటర్లు బహుళ రహదారి వనాలు ఏర్పాటు అయ్యాయి” అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

“13 లక్షల 44 వేల ఎకరాల అటవీ పునరుద్ధరణ, 1 లక్ష 40 వేల ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తి చేశాం. 24 కోట్ల53 లక్షల మొక్కలు నాటడం జరిగింది. పునరుద్ధరణ ద్వారా పెరిగిన మొక్కలు 53 కోట్ల 84 లక్షలని” మంత్రి చెప్పారు. “రాష్ట్ర వ్యాప్తంగా నగరాలకు సమీపంలో 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులు, 75 వేల 740 ఎకరాల్లో ఈ పార్కులు అభివృద్ధి జరిగింది. 164 హరిత వనాల్లో వంద శాతం పచ్చదనం సాధించేందుకు 1లక్ష 71వేల ఎకరాల్లో 1 కోటి 6 లక్షల మొక్కలు నాటాం.దీంతో తెలంగాణ రాష్ట్రం హరిత హారానికి అనేక అవార్డులు, రివార్డులు వచ్చాయని” మంత్రి చెప్పారు. “ఐక్యరాజ్య సమితి, నీతి ఆయో గ్ అభినందించారు. అత్యధిక జీవవైవిధ్యం గల నగరంగా గుర్తింపు పొందిందని” తెలిపారు.

వరంగల్ జిల్లాలో…
“వరంగల్ జిల్లాలో 2015 నుండి 2022 వరకు జరిగిన హరితహర కార్యక్రమం ద్వారా 2 కోట్ల 79 లక్షల 96 వేల మొక్కలు లక్ష్యం కాగా 2 కోట్ల 11 లక్షల 55 వేలు మొక్కలు నాటడం జరిగింద‌న్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వరంగల్ జిల్లాలో వివిధ శాఖల ద్వారా 88 వేల 860 మొక్కలు నాటడం జరుగుతుంద‌ని పేర్కొన్నారు. 2023 వ సంవత్సరం వరంగల్ జిల్లా వ్యాప్తంగా 25 లక్షల 95 వేల మొక్కలు నాటే లక్ష్యంగా వుందని” మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

- Advertisement -

జనగాం జిల్లాలో…
“జనగాం జిల్లాలో 2016 నుండి ఇప్పటివరకు 4 కోట్ల 20 లక్షల 83 వేల మొక్కలు నాటడం జరిగింది. జనగామ జిల్లాలో 281 గ్రామ పంచాయతీల యందు నర్సరీలను గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పెంచడం జరుగుతున్నది. అటవీ, మున్సిపాలిటీ, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా మొత్తం 294 నర్సరీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 63 లక్షల 31 వేల మొక్కల పెంపకం జరుగుతున్నది. 2018 నుండి ఇప్పటివరకు మొత్తం 2 కోట్ల 9 లక్షల 98 వేల మొక్కల పెంపకం జరిగినది. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జనగాం జిల్లాలో వివిధ శాఖల ద్వారా 34 వేల మొక్కలు నాటడం జరుగుతుంది. 2023 వ సంవత్సరం జనగాం జిల్లా వ్యాప్తంగా 28 లక్షల 46 వేల మొక్కలు నాటే లక్ష్యంగా వుందని” మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా అటవీ శాఖ అధికారి వసంత, జనగామ డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామిరెడ్డి, వరంగల్ drdo సంపత్ రావు, సంబంధిత విభాగాల సిబ్బంది మొక్కలు నాటి, హరితహారం పై ఏర్పాటు చేసిన గోడ పత్రికను ఆవిష్కరించి, హరిత ప్రతిజ్ఞ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement