వరంగల్ – తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించిన తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదవుతున్న వర్షపాతం, వరదలు, లోతట్టు ప్రాంతాల జలమయం, వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర పరిస్థితుల్లో, రెస్క్యూ టీమ్స్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు తదితర అంశాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో గల ఆరు జిల్లాల కలెక్టర్లతో, సిపి, ఎస్పీ, ఇతర అధికారులతో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల పరిస్థితిని, వాళ్ళు తీసుకున్న ముందు జాగ్రత్త చార్యలను ఆ జిల్లాల కలెక్టర్లు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల జిల్లాల్లో రెడ్ అలెర్ట్ వుందని ప్రజలకి ఏ సమస్య ఉన్నా అధికారులకు తెలియచేయాలని, ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా వెంటనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే జిల్లా కలెక్టరేట్ల లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో వున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి చేర్చాలని, అలాగే పునరావాస కేంద్రాల్లో వారికి భోజన సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. కాగా, గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల పై ఆరా తీసిన మంత్రి , అధికారులు అందుబాటులో ఉoడాలని చెప్పారు. ఇదే సందర్భంలో తాను కూడా సహాయక చర్యలలో పాల్గొంటున్నానని, ప్రజా ప్రతినిధులు, యువత కూడా అధికారులకు సహకరించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.