Friday, November 22, 2024

ఫీజు తగ్గేదేలే.. పెంచాల్సిందే అంటున్న ఇంజనీరింగ్‌ కాలేజీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్‌ ఫీజుల లడాయి ఎంతకీ తెగడంలేదు. ఎంతో కొంత ఫీజులను పెంచాల్సిందేనని ఇంజనీరింగ్‌ కాలేజీలు పట్టుబడుతున్నాయి. ఫీజుల విషయంలో కాలేజీల వ్యవహారం తగ్గేదేలే..అన్నట్లుగా ఉంది. దీంతో మరోసారి కాలేజీలతో టీఏఎఫ్‌ఆర్‌సీ (తెలంగాణ అడ్మిషన్‌, ఫీ రెగ్యులేటరీ కమిటీ) భేటీ కాబోతోంది. ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారు విషయంపై ఈనెల 24వ తేదీన జరిగిన ముఖాముఖి బేటీలో 25 ప్రైవేట్‌ టాప్‌ కాలేజీలు కమిటీ నిర్ధారించిన ఫీజులను ఒప్పుకోని విషయం తెలిసిందే. ఈక్రమంలో మరోకసారి ఆయా కాలేజీలను పిలిచి వారితో ఫీజుల ఖరారు అంశంపై సమావేశం కానున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆ 25 కాలేజీల యాజమాన్యాలతో టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు భేటీ అయి ఫీజు అంశాన్ని తేల్చనున్నారు. అయితే ఫీజులను తగ్గించడాన్ని ఒప్పుకోని కొన్ని ప్రైవేట్‌ కాలేజీలు ఎట్టిపరిస్థితుల్లో ఫీజును ఎంతో కొంత పెంచాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తాము ప్రతిపాదించిన ఫీజు కంటే చాలా తక్కువగా ఫీజును ఎలా ఖరారు చేస్తారని టీఏఎఫ్‌ఆర్‌సీని కొన్ని కాలేజీలు ప్రశ్నించినట్లు సమాచారం. ఓ ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీ తమ వార్షిక ఫీజును రూ.2 లక్షల వరకు ఖరారు చేయాలని అధికారులకు సమర్పించే అడిట్‌ నివేదికలో కోరినట్లు సమాచారం.

దాంతో కళాశాల ఆదాయ, వ్యయాలను పరిశీలించి ఫీజులను ఖరారు చేసే టీఏఎఫ్‌ఆర్‌సీ ఆ ప్రతిపాదిత కళాశాల ఫీజును రూ.1.12 లక్షలకు ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో గత బ్లాక్‌ పిరియడ్‌లో ఆ కళాశాల రూ.1.34 లక్షలుగా ఉన్న ఫీజు కంటే కూడా ఈ ఏడాది మరీ ఇంత తక్కువగా(1.12 లక్షలు) ఫీజును ఎలా ఖరారు చేస్తారని కమిటీ ముందు ఏకరువు పెట్టినట్లు సమాచారం. జులైలో మొదటి సారిగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలతో టీఏఎఫ్‌ఆర్‌సీ హియరింగ్‌ (సంప్రదింపులు) జరిపి ఫీజులను ఖరారు చేసింది. దీంతో చాలా కాలేజీల్లో ఫీజులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కనిష్ట ఫీజు రూ.45 కాగా, గరిష్ట ఫీజును రూ.1.73 లక్షలుగా ఖరారు చేశారు. దాదాపు 40 కాలేజీల్లో రూ.లక్షకుపైగా ఫీజులు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో ఫీజుల పెంపుపై విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లి రెండో సారి ఈనెలలోనే కాలేజీలకు హియరింగ్‌కు టీఏఎఫ్‌ఆర్‌సీ ఆహ్వానించింది. ఈ సమావేశంలోనైనా అధికారులు ఫీజులను ఖరారు చేశారా అంటే అదీలేదు. అడిట్‌ రిపోర్టుల్లో తప్పులు దొర్లినట్లు తేలడంతో గతంలో ఖరారు చేసిన ఫీజులను తగ్గిస్తూ కొత్త ఫీజులను నిర్ణయించారు. దీంతో చాలా కాలేజీల్లో ఫీజులు భారీగా తగ్గాయి.

గతంలో 40 కాలేజీల్లో లక్ష దాటిన ఫీజులు…రెండో సారి నిర్ధారించినప్పుడు 12 కాలేజీల్లో మాత్రమే ఫీజులు రూ.లక్ష దాటాయి. ఫీజులు తగ్గిన కాలేజీల్లో దాదాపు టాప్‌ ప్రైవేట్‌ కాలేజీలే ఉండడంతో దీన్ని తగ్గిన ఫీజులను ఒప్పకోని పరిస్థితి. ఈ వారంలో కాలేజీలను మూడోసారి హియరింగ్‌కు పిలిచి అదే రోజు కమిటీ ఫీజులకు ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. ఫీజుల అంశం కొలిక్కి రాకపోవడంతో అక్టోబర్‌ 11కు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా వేశారు. దీంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియకు ముందే ఫీజుల అంశాన్ని కొలిక్కితెచ్చి కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని అధికారులు చర్యలు చేపడతున్నారు.

ముందు నుంచి గందరగోళమే…

- Advertisement -

ఇంజీనిరింగ్‌ ఫీజుల అంశం ముందు నుంచీ అంతా గందరగోళంగానే మారింది. మొదటి సారి జులైలో ఫీజులను భారీగా పెంచుతూ టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసింది. తీరా ఖరారు చేసిన తర్వాత ఆ ఫీజులు ఈ ఏడాది నుంచి అమల్లోకి రావని, గతేడాది ఫీజులను ఈ ఒక్క ఈ ఏడాదికి అమలు చేయాలని అనధికారికంగా కాలేజీలకు ఆదేశించారు. దీనిపై అబ్యంతరం వ్యక్తం చేసిన దాదాపు 81 కాలేజీలు కోర్టుకు వెళ్లి మొదటి సారి ఖరారు చేసిన ఫీజులకు అనుమతులు తెచ్చుకున్నాయి. దీంతో ఫీజుల పెంపుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత మళ్లి రెండో సారి ఈనెల సెప్టెంబర్‌లో దాదాపు 93 కాలేజీలను టీఏఎఫ్‌ఆర్‌సీ రెండోసారి హియరింగ్‌కు పిలిచింది.

అయితే అడిట్‌ రిపోర్టుల్లో తప్పులు దొర్లినట్లు గమనించిన అధికారులు పెరిగిన ఫీజులను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫీజులను తగ్గించడాన్ని 25 కాలేజీలు ఒప్పుకోలేదు. దీంతో వీరిని మరోసారి హియరింగ్‌కు పిలిచి ఫీజులపై అభిప్రాయాలను తీసుకొని ఆ తర్వాత ఖరారు చేయనున్నారు. ఇలా మొదటి నుంచి కూడా ఫీజుల ఖరారు అంశంలో టీఏఎఫ్‌ఆర్‌సీ తీరు విమర్శలకు తావిస్తోంది. ఫీజుల ఖరారు అంశంపై ప్రభుత్వం కూడా టీఏఎఫ్‌ఆర్‌సీ తీరుపై సీరియస్‌ అయినట్లు ఉన్నత విద్యామండలి వర్గాల ద్వారా తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement