Wednesday, November 20, 2024

‘ఢిల్లీలో శత్రువులు, గల్లీలో మిత్రులు.. టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు నీచ రాజకీ యాలు’

హైదరాబాద్ (ప్రభా న్యూస్) : ఢిల్లీలో బద్ధ శత్రువులుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గల్లీలో మిత్రులు గా మారారని హుజురాబాద్ ఉప ఎన్నిక నే సజీవ సాక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కోనే దమ్ము లేక భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనత కాంగ్రెస్ గా హుజురాబాద్ లో ఆవిర్భవించిందని ఎద్దేవా చేశారు.

2009 ఎన్నికల్లో హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీకి 41,717 ఓట్లు రాగా 2014 ఎన్నికల్లో 38,278 ఓట్లు, 2018 లో 61,121 ఓట్లు వచ్చాయని గత నెల 30న జరిగిన ఉప ఎన్నికలో మాత్రం కేవలం 3,112 ఓట్లు రావడమే రెండు పార్టీల నీచ రాజకీయానికి నిదర్శనం అన్నారు. ఎన్నికల ఫలితం రాగానే కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేసిన ప్రకటనలు తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఈ మధ్య కాలం లో పదే పదే త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ అంటుంటే మొదట తమకు అర్థం కాలేదని ఒక ఆర్ అంటే రాజాసింగ్, మరో ఆర్ అంటే రఘునందన్, ఇంకో ఆర్ అంటే రేవంత్ రెడ్డి అని నిన్ననే స్పష్టమైందన్నారు.

దొంగ పొత్తుతో బీజేపీ గెలిచినా నైతిక విజయం టీఆర్ ఎస్‌దే న‌న్నారు. కమలం కింద పడకుండా చేతితో అడ్డుకున్నారన్నారు. బిజెపి ఎన్నికల కమిషన్ తో కెసిఆర్ సభ జరగకుండా అడ్డుకుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా 72 గంటల ముందే ప్రచారం నిలిపివేసి కేంద్ర బలగాలను మోహరించి తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. 20 ఏళ్లలో తెరాస ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో ఉప ఎన్నికల్లో పాల్గొని భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించామన్నారు. నాగార్జున సాగర్ లో జానా రెడ్డి ని ఓడించామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానంలో తెరాస గెలుపొందిన విషయం మర్చిపోతున్నారన్నారు.

ఈటల రేవంత్ కుమ్మకై కాంగ్రెస్ ఓటును బిజెపి కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని, తెలంగాణ సమాజం ఈ విషయాన్ని గమనించాలన్నారు. దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో హిమాచల్లో బిజెపి ఘోరపరాజయం పొందిందని, కర్ణాటకలో సైతం పరాభవం ఎదుర్కొన్నారన్నారు. అమ్మడం, కొనడం రేవంత్ నీకు తెలిసినంత మరెవరికీ తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని లేకపోతే భవిష్యత్తులో ఉనికి కోల్పోతారన్నారు. గెలిచిన వెంటనే ఈటెల మరోసారి తన నిజస్వరూపం బయట పెట్టారని, ఎన్నికల ప్రచారానికి వచ్చిన వాళ్ల సంగతి చూస్తానని మాట్లాడుతున్నారని తాటాకు చప్పుళ్ళకు తెరాస నాయకులు భయపడరన్నారు.

ఈట‌ల హుజురాబాద్ కు ఏం చేస్తారో తెలియజేయాలని, మోడీ కాళ్ళు మొక్కి ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. తరుణ్ చుగ్ ప్రకటించిన మేనిఫెస్టో అమలుకు ప్రయత్నించాలన్నారు. కేంద్ర మంత్రి తో పాటు బీజేపీ ఎంపీలు తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని, ప్రాజెక్టులకు జాతీయ హోదా తేవాలని, మిషన్ భగీరథ కు నిధులు తీసుకురావాలని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement