హైదరాబాద్, ఆంధ్రప్రభ : పెట్టుబడిదారుల పట్ల తమ ప్రభుత్వం విధేయతతో ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర రాబడిని పెంచుతున్న సంస్థలకు తప్పకుండా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు ఇక్కడ పెట్టుబడులు పెట్టి తయారీ యూనిట్లు పెట్టేవారి కోసం ఇప్పటికే వివిధ పాలసీలు తీసుకువచ్చామన్నారు. మంగళవారం హైదరాబాద్ హైటెక్ సిటీ హుడా టెక్నో ఎన్‌క్లేవ్‌లో జాన్సన్ కంట్రోల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భండగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ భారత్‌లో టాలెంట్ ఉన్న ఉద్యోగులకు కొదవ లేదన్నారు. వ్యాపార విస్తరణ చేయడంతో పాటు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు జాన్సన్ కంట్రోల్ సంస్థకు మంత్రి కృతజ్ఞతలుతెలిపారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో అయిదుగురు ఉద్యోగులను కలిగి ఉన్న జాన్సన్ కంట్రోల్ ప్రస్తుతం ఈ సంఖ్యను 500కు పెంచడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో పెట్టుబడులకు ఒకే ఒక్క గమ్యస్థానం హైదరాబాద్ అన్నారు. ఎంత అభివృద్ధి చెందిందో రాష్ట్రంలో ఎన్ని వ్యాపార అవకాశాలు ఉన్నాయో ఇక్కడ ఎంత సులభంగా వ్యాపారం చేయవచ్చో జాన్సన్ కంట్రోల్‌కు ఇప్పటికే అర్ధమై ఉంటుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీ హబ్, టీ సెల్ హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిపారు. ఇమేజ్ టవర్స్, ప్రపంచస్థాయి కమాండ్ కంట్రోల్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి హైదరాబాద్ అడ్డాగా మారబోతున్నదని వెల్లడించారు. ఇక్కడ అద్భుతమైన మౌలిక వసతులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కోరగా ఇందుకు జాన్సన్ కంట్రోల్ ఇండియా వీపీ, జీఎం డేవ్ పుల్లింగ్ అంగీకరించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యాకార్యదర్శి జయేశ్ రంజన్, జాన్సన్ కంట్రోల్ వీపీ, జీఎం డేవ్ పుల్లింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ కోసం యాక్సెంచర్‌తో ఒప్పందం…
ఈ నూతన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ కోసం ప్రఖ్యాత ఐటీ కంపెనీ యాక్సెంచర్‌తో జాన్సన్ కంట్రోల్ ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా జాన్సన్ కంట్రోల్ కార్యకలాపాల్లో యాక్సెంచర్ అ్యతంత కీలకమైన పాత్ర పోషించనుంది. వారి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ బృందాలు జాన్సన్ కంట్రోల్ అత్యున్నత శ్రేణి సాంకేతికతకు ఉపయోగించేందుకు తోడ్పడనున్నట్లు ఆ కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఈ ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ కేంద్రంలో యాక్సెస్ కంట్రోల్, ఇంట్రూజన్ వీడియో సర్వియలన్స్ ఉత్పత్తుల పరిశోధనపై దృష్టిపెట్టనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.