హైదరాబాద్ – ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ ఆర్థిక వ్యవహారాలకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా.. అదానీకి అన్ని రకాలుగా తోడు నీడగా ఉంటూ ఆయన కోసం కష్టపడుతున్న రేవంత్ రెడ్డి.. నేడు అదానీకి వ్యతిరేక ర్యాలీ ని తీయాలని అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
జైపూర్‌లో సరిగ్గా అతిథి మర్యాదలు జరగలేదోనో.. ఢిల్లీలో అపాయింట్‌మెంట్ దక్కలేదనో.. మొత్తానికి కొత్త నాటకానికి శ్రీకారం చుట్టాడు మన చిట్టినాయుడు అని కేటీఆర్ విమర్శించారు.
భాయ్, భాయ్ అని వందల, వేల కోట్లు పంచుకున్న ముఖ్యమంత్రి.. అదానీ వ్యతిరేక రాలీ తీస్తున్నాడంట అని అన్నారు. నవ్వి పోదురు నాకేటి సిగ్గు అని.. రేవంత్ రెడ్డిని చూసే రాసుంటారని వ్యాఖ్యానించారు. మిమ్మల్ని ఎన్నుకున్నంత మాత్రం ప్రజలు మరీ అంత తెలివి తక్కువ వాళ్ళనుకుంటున్నావా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. లేక మళ్లీ మళ్లీ మోసం చెయ్యచ్చులే అనుకుంటున్నావా అని నిలదీశారు. దొంగే దొంగ అనడం నేడు కామన్ అయిపోయిందని చెప్పారు.