హైదరాబాద్ – ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. యువతకు మిగిలింది విలాపమే అని అన్నారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో నేడు ట్విట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లుగా కాంగ్రెస్ పబ్లిసిటీ చేసుకుంటుందని కేటీఆర్ మండిపడ్డారు. 55, 143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ బడాయి మాటలు చెబుతుందని విమర్శించారు. ఏడాదిలో కాంగ్రెస్ భర్తీ చేసింది కేవలం 12,527 ఉద్యోగాలు మాత్రమే అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ నియమాక పత్రాలు ఇస్తూ గొప్పలు చెబుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు మరిచి.. నిరుద్యోగ యువతను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్ కు అధోగతే అని హెచ్చరించారు. కాంగ్రెస్ యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని గుర్తు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
జాబ్ క్యాలెండర్ జాడ లేదు.. 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చింది 12,527 మాత్రమే అని తెలిపారు. కాంగ్రెస్ ఇంకా 1,87,473 ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు బాకీ ఉందని వివరించారు. ఏరు దాటాక తెప్ప తగిలేసినట్లు, అధికారం వచ్చాక కూడా అబద్దాలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. నిజం నిప్పులాంటిదని కాంగ్రెస్ మోసాలకు తెలంగాణ జవాబు చెబుతుందని స్పష్టం చేశారు. జాగో తెలంగాణ యువత అని పిలుపునిచ్చారు.