ఐటీ ఉద్యోగుల మేధస్సు, అవిశ్రాంత శ్రమే ప్రపంచానికి వెన్నుముక
ఐటి లో నా నేపథ్యం నాకు గర్వకారణం
యాక్సిడెంటల్ నేతలకు ఐటి విలువ తెలీదు
వారి విధానాలతోనే భారీగా నష్టం
హైదరాబాద్: ఐటీ పరిశ్రమలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం చాలా అవసరం.. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకు డబ్బులు పంపించడానికి ఇలాంటివాటితో పనిలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఐటీ ఉద్యోగుల మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నెముక అని చెప్పారు. వారే లేకుంటే ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయన్నారు. కేటీఆర్ ఐటీ ఎంప్లాయ్ కాబట్టి ఎంప్లాయ్ మైండ్‌సెట్‌తో ఆలోచిస్తాడు. నేను పొలిటీషియన్‌ని, పాలసీ మేకర్‌ని.. నాకు అన్ని తెలవాల్సిన అవసరం లేదంటూ దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.
‘తనను ఓ ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడొచ్చని అనుకునేవాళ్లకు ఒకటే చెప్పదలచుకున్నా. ఐటీ పరిశ్రమలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం చాలా అవసరం. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకు డబ్బులు పంపించడానికి ఇవేమీ అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంతో కష్టపడి వారి జీవనోపాధిని పొందుతున్నారు.
ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల్లో ఉన్న నా అక్కాచెల్లెళ్లకు, అన్నాదమ్ముళ్లకు సలాం. మీ విద్యార్హతలకు, మీ నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు సరితూగరు. అలాంటి వాళ్లు ప్రవేశపెట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. నా విద్యార్హతలు, నా ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం.. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికీ గర్వకారణం.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.