జైనథ్, నవంబర్ 26 ( ఆంధ్రప్రభ ) : నిరుపేదలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిందని ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల శంకర్ అన్నారు. ఉపాధి హామీ నిధులతో పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణం చేసుకోవచ్చన్నారు. ఇవాళ జైనథ్ మండలంలోని ఆశింపూర్ ఆదిలాబాద్ మండలంలోని రామాయిలో పంచాయతీ భవనాల నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
గ్రామాలకు వెళ్లే రోడ్లతో పాటు వ్యవసాయ భూములకు వెళ్లే పానాది రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రజల మేలుకోరి వారికి సేవచేసే నాయకులను ప్రజలు గుర్తుపెట్టుకుంటారని, దీనికి మహారాష్ట్ర ఎన్నికలే ఉదాహరణ అన్నారు. ఎవరెన్ని కల్లిబొల్లి మాటలు చెప్పినా ప్రజలు బీజేపీని విశ్వసించి భారీ మెజార్టీతో గెలిపించారని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు రాజ్యాంగ విలువలకు కట్టుబడి అధికారులైనా, నాయకులైనా పనిచేయాలన్నారు. కొంతమంది చిల్లర మల్లర వ్యవహారాలకు పాల్పడుతున్నారన్నారు. అలాంటి వారిని రాజ్యాంగం శిక్షించే అధికారం కూడా ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు రాందాస్, సుభాష్, తదితర నాయకులు పాల్గొన్నారు.