(ప్రభ న్యూస్ – నిజామాబాద్ క్రైం) నగర నడబొడ్డున…పట్ట పగలు.. జన సందోహం మధ్య ఓ విద్యుత్ ఉద్యోగి, తన రౌడీ మూకతో వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డాడని నిజామాబాద్ నగరానికి చెందిన బాధితుడు విష్ణు గౌడ్ మీడియాతో వాపోయాడు.
. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం….ఆర్మూర్ ప్రాంతానికి చెందిన భీమా గౌడ్ విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మరోవైపు జీరో ఫైనాన్స్, చిట్టి వ్యాపారం చేస్తున్నాడు. డబ్బులు అవసరమై కొన్ని నెలల కిందట విష్ణు గౌడ్ జీరో చిట్టి కింద భీమా గౌడ్ దగ్గర రూ.5లక్షలు తీసుకున్నాడు. అందులో రూ.4లక్షల పైబడి డబ్బులు చెల్లించాడు. మరో రూ. 40వేల వరకు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులతో సకాలంలో విష్ణు గౌడ్ మిగతా డబ్బులు చెల్లించలేకపోయాడు. బాకీ డబ్బుల కోసం భీమా గౌడ్ సోమవారం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో ఉన్న విష్ణు గౌడ్ ఇంటికి అల్లరి మూకతో వచ్చాడు. ఇప్పటికిప్పుడే బాకీ డబ్బులు చెల్లించాలని విష్ణు గౌడ్ తో గొడవ పడ్డాడు.
ప్రస్తుతం డబ్బులు లేవని, చేతికి అందగానే చెల్లిస్తామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అయినా శాంతించని భీమా గౌడ్ తీసుకువచ్చిన వ్యక్తులతో కలిసి, గొడవకు దిగాడు. విష్ణు గౌడ్ ద్విచక్ర వాహనం దౌర్జన్యంగా లాకెళ్ళాడు. కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా, వినకుండా బండి తీసుకెళ్లాడు. బాధితులు ఇదంతా వీడియో తీశారు.
స్థానిక నాల్గో టౌన్ పోలీసు స్టేషన్ వెళ్లి, భీమా గౌడ్, అల్లరి మూకపై పిర్యాదు చేశారు. అయినా పోలీసుల నుంచి స్పందన కరువైంది. 24గంటల్లో కేసు నమోదు చేసి, కోర్టుకు పంపించాల్సిన పోలీసులు, కేసు నమోదులో జాప్యం చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఇకనైనా పోలీసులు కేసు నమోదు చేసి, తమ ఆధారాలను పరిగణలోకి తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. లేదంటే పోలీసు ఉన్నాతాధికారులను కలిసి, న్యాయం చేయాలని కోరుతామని పేర్కొన్నారు.