Tuesday, November 19, 2024

TS: ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి.. సీఈఓ వికాస్ రాజ్

కరీంనగర్ (ఆంధ్రప్రభ) : అసెంబ్లీ ఎన్నికలను పక్కా ప్రణాళికతో పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులు, రిటర్నింగ్ అధికారులతో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, సంసిద్ధత, ఫామ్-6, 7, 8, ఎలక్టోరోల్, జెండర్ రేషియో, పోలింగ్ కేంద్రాలు, చెక్ పోస్టులు, ఇతర ఎన్నికల ఏర్పాట్ల నిర్వహణపై జిల్లాల వారీగా సమీక్షించారు.

ఈ సందర్బంగా జిల్లాల్లో చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిఈఓకు జిల్లా ఎన్నికల అధికారులు వివరించారు. అనంతరం సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ… జిల్లాలోని నియోజకవర్గాల వారిగా సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీల నుండి కూడా సలహాలను స్వీకరించి, క్షేత్ర స్థాయిలో సమీక్షించుకోవాలన్నారు. సి విజిల్ యాప్ గురించి గ్రామ స్థాయిలోని ప్రజల వరకు తీసుకువెళ్లి అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఆర్.ఓ ల ద్వారా జారీ చేసే అనుమతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై తీసుకునే చర్యలపై జాప్యం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టర్లు, వాల్ రైటింగ్ లేకుండా వెంటనే తొలగించాలన్నారు. పోలింగ్ రోజు మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని, ఎన్నికల సామాగ్రి అప్పగింత, తరలింపులో సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, సీఈఓ కార్యాలయానికి ఎప్పటికప్పుడు నివేదికలను సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్, డి.ఐ.జి రమేష్ నాయుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారులు ప్రఫుల్ దేశాయ్, యాస్మిన్ బాషా, ముజమ్మిల్ ఖాన్, కెమ్యా నాయఖ్, రామగుండం సిపి రెమో రాజేశ్వరి, ఎస్పిలు, రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement