హైదరాబాద్ – తెలంగాణలో హంగ్ ఏర్పాడే అవకాశాలు లేవని, సంపూర్ణ మెజర్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సిపిఐ జాతీయ సహాయ కార్యదర్శి నారాయణ అన్నారు.. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ తెలంగాణను పాలించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని శాసన సభాపక్ష నేతగా కేసీఆర్ ఆహ్వానించే పరిస్థితి రాబోతుందని తెలిపారు. నియంత లాంటి కేసీఆర్ కంటే.. ఐదు సంవత్సరాల్లో ఐదుగురు సీఎంలు వచ్చినా పరవాలేదని చెప్పారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను క్యాంప్ నకు తరలించాలని భావిస్తోందని వెల్లడించారు. తమ పార్టీ అభ్యర్థి సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లే క్యాంప్ నకు సాంబశివరావు వెళ్లబోరని అన్నారు. సాగర్ ఉద్రిక్తతపై ఆయన స్పందిస్తూ, ఎన్నికలలో కెసిఆర్ గెలుపు కోసమే జగన్ ఈ నాటకానికి తెరతీశారని ఆరోపించారు.