Friday, November 22, 2024

Elections Effect – మే 8 నుంచి టీఎస్‌ ఎప్‌సెట్‌? మారనున్న షెడ్యూల్‌

లోక్‌స‌భ ఎన్నికలతో మారనున్న షెడ్యూల్‌
గత షెడ్యూల్‌కు ఒక రోజు ముందుకు జరిపే అవకాశం
మొత్తం దరఖాస్తుల సంఖ్య‌ 1,49,183
ఇంజినీరింగ్ విద్యార్థుల‌ నుంచి 1,03,586
అగ్రికల్చర్‌, ఫార్మసీ స్టూడెంట్స్ నుంచి 45,466
ఈ రెండింటికి 131 మంది విద్యార్థుల‌ ద‌ర‌ఖాస్తు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంజినీరింగ్‌, ఫార్మసీ, నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ ఎప్‌సెట్‌ (ఎంసెట్‌) పరీక్షలను ఒక రోజు ముందుకు జరిపే అవకాశాలున్నాయి. ఈ పరీక్షలను మే 8 నుంచి నిర్వహించాలని జేఎన్టీయూ భావిస్తున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. మే 9 నుంచి 12 వరకు టీఎస్‌ ఎప్‌సెట్‌ పరీక్షలు నిర్వహించాలని గతంలో షెడ్యూల్ వెలువ‌రించారు. అయితే.. మే 13న లోక్‌స‌భ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. దీంతో పరీక్షలపై దాని ప్రభావం పడుతోంది. కాగా, మే 8న టీఎస్‌పీఎస్సీ ఓ పరీక్షను నిర్వహించనుంది. ఈ ఎగ్జామ్‌పై టీఎస్‌పీఎస్సీని సంప్రదించగా, ఇది ఆఫ్‌లైన్‌ ఎగ్జామ్‌ అని వివరించారు. దీంతో ఎప్‌సెట్‌కు ఈ అడ్డంకి తొలగిపోనుంది.

మే 8న స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిటీ పరీక్ష జరగనుంది. దీనికి పరిమిత సంఖ్యలోనే అభ్యర్థులు హాజరుకానున్నారు. దీంతో ఎప్‌సెట్‌ని ఒక రోజు ముందుకు జరపాలని అధికారులు నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ పరీక్ష తేదీలపై తుది ప్రకటన చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇదిలా ఉంటే సోమవారం వరకు ఎప్‌సెట్‌కు మొత్తం 1,49,183 దరఖాస్తులు అందగా, అందులో ఇంజినీరింగ్‌ దరఖాస్తులు 1,03,586, అగ్రికల్చర్‌, ఫార్మసీకి 45,466 వచ్చాయి. రెండింటికి దరఖాస్తు చేసిన వారు 131 మంది విద్యార్థులున్నారు. మరోవైపు టీఎస్‌ ఐసెట్‌ పరీక్ష జూన్‌ 4, 5వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేశారు. జూన్‌ 4న లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఐసెట్‌ పరీక్ష కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఈ పరీక్షను జూన్‌ 3న నిర్వహించాలా? ఆతర్వాత నిర్వహించాలా? అనేదానిపై ఈరోజు అధికారులు సమావేశమై చర్చించి ఆ తర్వాత ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement