విజయవాడ – తెలంగాణ సమాజం మార్పు కోసం చూస్తోందన్నారు కేపీసీసీ అధ్యక్షుడు , కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు గాను ఆయన శుక్రవారం విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి డీకే రోడ్డు మార్గాన కోదాడ , హుజూర్ నగర్ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.సీఎం కేసీఆర్ ఎప్పుడూ మమ్మల్ని తలుచుకోనిదే నిద్రపోరని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున ఐదు గ్యారెంటీలు అమలవుతున్నాయని తెలిపారు. సీఎం కుర్చీకోసం కొట్లాటలు జరగడం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారని శివకుమార్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని.. ప్రజలు కూడా ఇప్పటికే కేసీఆర్ ను సాగ నంపడానికి సిద్ధమయ్యారని ఆయన తెలిపారు. సోనియాకు కృతజ్ఞతలు తెలపాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ ఫాంహౌజ్‌లో రెస్ట్ తీసుకోవాల్సిందేనని డీకే చురకలంటించారు. తన పేరుతో నకిలీ లెటర్ సృష్టించారని.. కర్ణాటకలో ఫేక్ లెటర్‌పై ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. తెలంగాణకు మేం డబ్బులు పంపిస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని.. మేం డబ్బులు పంపిస్తే బీఆర్ఎస్ నిద్ర పోతుందా అని డీకే శివకుమార్ ప్రశ్నించారు.