Friday, November 22, 2024

తెలంగాణ‌లో ఎన్నిక‌ల కాక – రంగంలోకి ఎన్నిక‌ల క‌మిష‌న్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ డిప్యుటీ కమిషనర్‌ నితీష్‌ వ్యాస్‌ నేతృత్వంలోని సీనియర్‌ అధికారుల బృందం శనివారం హైదరాబాద్‌లో పర్యటించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌, ఇతర సీనియర్‌ అధికారులతో ఈ బృందం సమావశమై కీలక అంశాలపై చర్చించింది. ఓటర్ల జాబితా, మార్పులు, చేర్పులు, ఈవీఎంల సన్నద్ధత, ఇతర అంశాలపై ఈ బృందం రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశమై సమీ క్షించింది. లోటుపాట్లు లేకుండా, ఎటువంటి అవకతవకలకు ఆస్కారంలేని రీతిలో ఓటర్ల జాబితాను రూపొందించేలా నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేశారు. రిటర్నింగ్‌ అధికారుల సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని సీఈవో వికాస్‌రాజ్‌కు ఈ బృందం ఆదేశాలు జారీ చేసింది. జూన్‌ 1నుంచి ఈవీఎంల మొదటి దశ పరిశీలన చేపట్టాలని, జిల్లా ఎన్నికల అధికారులకు రెండు రోజుల శిక్షణా తరగతుల సెమినార్‌ను త్వరలో నిర్వహించాలని ఆదేశించారు. ఈసీఐఎల్‌ సరఫరా చేసిన ఈవీఎంలను పరీక్షించి జిల్లాలకు పంపిణీ చేసినట్లు సీఈవో వికాస్‌రాజ్‌ వెల్లడించారు. ఎన్నికల విధుల్లో పాలు పంచుకునే అన్ని స్థాయిల అధికారులకు, ఇంకా విధులు నిర్వహించే ఇతర సిబ్బందికి శిక్షణ కోసం ప్రణాళిక రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఈ సందర్భంగా సూచించింది. ఓటర్ల నమోదు, ఎన్నికల్లో భాగస్వామ్యం, పోలింగ్‌ శాతం పెంపు వంటి అంశాలపై ప్రజల్లో ప్రచారం చేసి చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

కాగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని, ఓటర్ల జాబితా సవరణ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే దశల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం బృందాలు రాష్ట్రంలో పర్యటించే అవకాశముంది. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందనుంది. ఆ తర్వాత ఎన్నికల తేదీలను ప్రకటించనుంది.

కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితా, ఈవీఎంల సన్నద్దత, శాంతిభద్రతలు వంటి అంశాలపై సీఈసీ పరిశీలించనుంది. ఆయా అంశాలపై సమగ్ర నివేదికలను సేకరించిన తర్వాత స్పష్టతనివ్వనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సంతప్తి చెందిన తర్వాత బూత్‌ల ఏర్పాట్లు, పరిశీలకులు, నిఘా బృందాలు సిద్దం చేయనున్నారు.
రాష్ట్రంలో బ్యాలెట్‌ యూనిట్లు 52100, వీవీప్యాట్‌లు 44వేలుగా కేటాయింపు ఉండగా వీటిని కూడా అదనంగా కేటాయించాలని కోరింది. బ్యాలెట్‌ యూనిట్లు 56వేలు, కంట్రోల్‌ యూనిట్లు 44550, వీవీప్యాట్‌లు 49500లుగా కావాలని కోరుతోంది. ఎన్నికలకు కీలకమైన ఓటర్ల జాబితా కొలిక్కి రావడంతో ఎన్నికల ఏర్పాట్లపై వేగం పెంచారు. ఇక ఎన్నికల సిబ్బంది బదలీలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒక్కో బూత్‌కు ఐదుగురు అధికారులను కేటాయించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, అవసరమైన సిబ్బంది. సున్నిత ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు, ఇందుకు భద్రతా సిబ్బంది, కేంద్ర అదనపు బలగాలు తదితర అంశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదిక సిద్దం చేయాల్సి ఉన్నది.

కాగా ఎన్నికలతో సంబంధం ఉన్న జిల్లా కలెక్టర్లు, జేసీలు, రిటర్నింగ్‌ అధికారులు, ఈఆర్వోలు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల నోడల్‌ అధికారులు, డిప్యుటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికారులకు బదలీ మార్గదర్శకాలు అమలయ్యేలా ఈసీ ఉత్తర్వులను వీలైనంత తొందర్లో విడుదల చేయనున్నది. అదేవిధంగా ఎన్నికలతో సంబంధం ఉండి, బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యే ఐజీ, డీఐజి, రాష్ట్ర సాయుధ బలగాల కమాండెంట్లు, ఎస్సీలు, అదనపు ఎస్పీలు, డిఎస్పలు, స్టేషన్‌ హౌజ్‌ అధికారులు, సీఐలు, ఎస్సైలు, రిజ ర్వ్‌ సీఐలకు కూడా ఇవే ఉత్తర్వులు వర్తించనున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఎండలను మరిపించే స్థాయికి చేరగా, తాజాగా ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలతో మరింత వేడెక్కనున్నాయి.
రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లేందుకు ఇక సమయం దగ్గరపడిందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాదే శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టం కావడంతో అన్ని పార్టీలూ ఎన్నికల రణరంగానికి సమాయత్తమవుతున్నాయి. కొన్ని పార్టీలకు ఈ ఎన్నికలు చావో రేవో కాగా, మరికొన్ని పార్టీలకు ఉనికి చాటుకునేందుకు ఇంకొన్ని పార్టీలకు అధికారం కోసం అన్నట్లుగా అనివార్యమయ్యాయి. ఎవరికి వారు ఈ దఫా తమకే అధికారం అన్నట్లుగా ఇప్పటినుంచే పోటీ పడే అవకాశాలు కనిపిస్తుండగా, రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల మధ్యకు వెళుతున్నాయి. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ లక్ష్యంగా పావులు కదుపుతుండగా, మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల బాట పనట్టారు,. ఆత్మీయ సమ్మేళనాలతో ప్రచారంలో ఒక అడుగు ముందు వరుసలో నిల్చారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం మండే ఎండలో తీవ్రంగా శ్రమిస్తోంది. నేతలంతా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలమధ్యే తిరుగాడుతున్నారు. రేవంత్‌, భట్టిలు పాదయాత్రలతో కార్యకర్తల్లో జోస్‌ పెంచుతున్నారు. ఇక బీజేపీ పార్టీ దక్షిణాదిలో రెండో రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారి ఎండలను మించే వేడిని పుట్టిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement