Tuesday, November 26, 2024

Election Expenditure – అభ్య‌ర్ధుల ఖ‌ర్చుపై ఈసీ ఫోక‌స్‌

రేట్ల వివ‌రాలు వెల్ల‌డించిన‌ ఎన్నిక‌ల క‌మిష‌న్‌
స‌మోసా నుంచి బిర్యానీ వ‌ర‌కు, బైక్ నుంచి బ‌స్సుల దాకా
మైక్ సెట్ నుంచి మ్యాన్ ప‌వ‌ర్ వ‌ర‌కు
టీ నుంచి ప‌బ్లిసిటీ వ‌ర‌కు ఖ‌ర్చుల నియంత్ర‌ణ
లెక్క ఇంతే చూపాలి.. లిస్ట్ రిలీజ్ చేసిన ఈసీ

దేశంలో లోక్‌సభ, ప‌లు రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొదటి ఓటింగ్ ఏప్రిల్ 19న, ఎన్నికల ఫలితాలు జూన్ 4న ఉండ‌బోతున్నాయి. కాగా, ఎన్నికల ఖర్చులను నియంత్రించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) శ‌నివారం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా మేజిస్ట్రేట్‌తో పాటు అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు (సీఈఓలు) ఏరియాను బట్టి అభ్యర్థుల ఖర్చులను నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సీఈవోలందరూ ఎన్నికల సంఘానికి నివేదికలు పంపారు. నీళ్ల నుంచి పటాకుల వరకు, టీ నుంచి పబ్లిసిటీ వరకు ఖర్చుపై పరిమితి విషయంలో అభ్యర్థులు నిబంధనలు పాటించగలరా లేదా అనేది చూడాలన్నారు. అలాగే కమిషన్ ముందు ఎన్ని ఉల్లంఘన కేసులు వస్తున్నాయో పరిశీలించాలని ఆదేశించారు.

వస్తువుల ధర జాబితా

అభ్యర్థులు ప్రతి పైసా బిల్లును, లెక్కను ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సి ఉంటుంది. కమిషన్ సూచనల మేరకు జిల్లా స్థాయిలో అభ్యర్థులకు వస్తువుల ధరల జాబితాను విడుదల చేశారు. ఇందులో అభ్యర్థుల ఖర్చు రేట్లను కూడా ఖరారు చేశారు. ఈసారి యూపీలో టీ, సమోసా ధర రూ.10గా నిర్ణయించగా, జిలేబీ ధర కిలో రూ.150గా ఉంచారు. సింగిల్ నాన్ ఏసీ గది ధర రూ.1150, డబుల్ బెడ్ రూ.1550గా నిర్ణయించారు. దీంతో పాటు రెండు లీటర్ల శీతల పానీయం బాటిల్ ధర రూ.90, శాఖాహారం ప్లేట్ రూ.80, నాన్ వెజిటేరియన్ ప్లేట్ ధర రూ.200గా ఉంచారు. అరలీటర్ వాటర్ బాటిల్ ధర రూ.10, లీటర్ రూ.20, రెండు లీటర్ రూ.30గా నిర్ణయించారు.

ప్రమోషన్ రేట్లు కూడా

ఇండికా, వ్యాగన్‌ఆర్‌, టాటా సుమో, మారుతీ జిప్సీ నాన్‌ఏసీ ధరలను రోజుకు రూ.1100గా ఉంచగా, ఈ ఏసీ వాహనాలకు రోజుకు రూ.1210గా ఉంచారు. స్కార్పియో, టవేరా, ఇన్నోవా, బొలెరో నాన్ ఏసీ ధర రూ.1294గా, ఏసీ వాహనాలకు రోజుకు రూ.1815గా నిర్ణయించారు. ఆయిల్ లేని ట్రాక్టర్ ట్రాలీకి రోజుకు రూ.484, ఆయిల్ లేకుండా మోటార్ సైకిల్ ద్వారా ప్రచారం చేసేందుకు రోజుకు రూ.400, సైకిల్ పై ప్రచారం చేసేందుకు రోజుకు రూ.100 చొప్పున ధర నిర్ణయించారు. ఎయిర్ కండీషనర్‌తో కూడిన సింగిల్ బెడ్ రూమ్‌ల ధర రూ.1650గా, డబుల్ బెడ్ రూమ్‌ల ధర రూ.1810గా నిర్ణయించారు.

- Advertisement -

రాష్ట్రాల వారీగా ఖ‌ర్చులో తేడా..

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రాల వారీగా కమిషన్‌ పర్యటిస్తున్నప్పుడు ఈ రేట్లు నిర్ణయించారు. అనంతరం ప్రతి జిల్లాలో అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి నిర్ణయించిన జాబితాను కచ్చితంగా పాటించాలని సీఈవోలందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇది ఇలా ఉంటే పోలింగ్ జ‌రిగే మే 13న అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌ల‌కు సెల‌వు ఇవ్వాల‌ని సంబంధిత రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement