Tuesday, November 19, 2024

ఏపీ, తెలంగాణ నుంచి ఎన్నికల ప్రచారం.. శ్రీకారం చుట్టనున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ద్రౌపదీ ముర్మూ తన ఎన్నికల ప్రచారాన్ని తెలుగు రాష్ట్రాల నుంచి మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరఫును ముర్మూను పోటీకి పెట్టాలని బాజపా అధినాయకత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈనెల 24న (శుక్రవారం) నామినేషన్‌ దాఖలు చేయనున్న ముర్మూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. జులై 2 నుంచి రెండు రోజులపాటు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో బాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆమెను ఇక్కడికి రప్పించి పరిచయం చేయాలన్న ప్రణాళికపై బాజపా అగ్రనాయకత్వం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

జాతీయ కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాలకు చెందిన బాజపా ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరవుతున్నందున రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపదీని ఇక్కడికి రప్పించి ఆమెను అందరికి పరిచయం చేయాలన్న సంకల్పంతో బాజపా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కూడా ఈ భేటీకి ఆహ్వానించాలని భావిస్తున్నట్టు సమాచారం. జులై 4న ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యటిస్తున్నందున ఆ రోజున ద్రౌపదీని అక్కడికి పిలిపించి సీఎం జగన్మోహన్‌రెడ్డి, వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలను పరిచయం చేయాలన్న ప్రణాళికపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా మద్దతు తనకు అవసరం లేదని బాజపాకు చెందిన సీనియర్లు ఇప్పటికే ప్రకటించారు. జులై 3న హైదరాబాద్‌, ఆ మరుసటి రోజు 4వ తేదీ ఏపీలో ద్రౌపదీ పర్యటన ఉండేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈనెల 24న నామినేషన్‌ దాఖలు చేయనున్న ముర్మూ వెనువెంటనే ప్రచారం నిర్వహించే ఆలోచన కూడా లేకపోలేదని ఒకవేళ అది జరిగితే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టే అవకాశాలు లేవని చెబుతున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఢిల్లిdలో ఉన్న రాష్ట్ర బాజపా నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్య నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నికల ప్రచారానికి అవసరమైన వేదికను ఖరారు చేయాలని రాష్ట్ర బాజపా నేతలు భావిస్తున్నారు. ఎన్డీఏ పక్ష నేతలు ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నందున ఓ స్టార్‌ హోటల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ప్రతిపాదనపై సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement