Friday, November 22, 2024

Election Campaign – నెలాఖ‌రు నుంచి బిజెపి బ‌స్సు యాత్ర‌లు ..

హైదరాబాద్‌ ,ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కడుపుతోన్న భారతీయ జనతా పార్టీ (భాజపా) బస్సు యాత్రలకు సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూనే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమనే నినాదంతో ఈ నెల చివరిన బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. తెలంగాణాలోని మూడు ప్రధాన పుణ్యక్షేత్రాలు అలంపూర్‌ జోగులాంబ, బాసర సరస్వతి మాత ,భద్రాచలం శ్రీరాముని చెంత నుంచి ఈ యాత్రలు మొదలు పెట్టాలని పార్టీ పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు 18 రోజుల పాటు కొనసాగే ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రతి రోజూ రెండు అసెంబ్లిd నియోజకవర్గాల్లో పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యాత్రలో భాగంగా ఆయా గ్రామాలు పట్టణాలలో ప్రజలతో మమేకమై ముఖాముఖి భేటీలు నిర్వహించాలని ప్రతిపాదించింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా వాటిని సీఎం కేసీఆర్‌ దారి మళ్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు పెడుతున్నారన్న విషయాన్ని గణాంకాలతో సహా బయట పెట్టాలని నిర్ణయించింది.

కేంద్ర నిధులతో చేపట్టిన కార్యక్రమాలను పధకాలను తాను అమలు చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న వైనాన్ని కూడా ఈ యాత్రలో ఎండగట్టేందుకు భాజపా సమాయత్తమవుతోంది. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్‌ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్న విషయాన్ని పదే పదే దుమ్మెత్తి పోస్తున్న భాజపా ఈ యాత్రల్లోనూ మరింత స్వరాన్ని పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. 18 రోజుల పాటు సాగనున్న బస్సు యాత్రలో భాగంగా ప్రతి అసెంబ్లిd నియోజక వర్గ కేంద్రంలో రాత్రి వేళల్లో భారీ బహరంగ సభను నిర్వహంచాలని ప్రతిపాదించింది యాత్రలపై రూట్‌ మ్యాప్‌ సిద్ధమైందని యాత్రలను ప్రారంభించేందుకు భాజపా రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నారని సమాచారం..నియోజక వర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభలకు కేంద్ర మంత్రులు ఆయా రాష్ట్రాల కీలక నేతలు మంత్రులను కూడా పిలవనున్నట్టు సమాచారం. అలంపూర్‌ నుంచి ప్రారంభమయ్యే బస్సు యాత్ర ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని 14 అసెంబ్లి సెగ్మెంట్లు అక్కడినుంచి ఉమ్మడి రంగారెడ్డి మెదక్‌ జిల్లాలో పర్యటించేలా రూట్‌ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం బాసర నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్‌ నిజామాబాద్‌ కరీంనగర్‌ జిల్లాలో భద్రాద్రి నుంచి ప్రారంభించే బస్సు యాత్రను ఉమ్మడి ఖమ్మం వరంగల్‌ నల్గొండ జిల్లాల్లో సాగేలా పార్టీ కమిటీ వ్యూహం రచిస్తోంది.

అన్ని యాత్రల్లో పార్టీ రాష్ట్ర నేతలు ఎంపీలు ఎమ్మెల్యేలు భాగస్వామ్యం అవుతారని పార్టీ కీలక నేత ఒకరు చెప్పారు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే లోపు యాత్రలన్నింటినీ పూర్తి చేసి ఇక ఎన్నికల రణరంగానికి సిద్ధమయ్యేలా ప్రణాళిక సిద్ధం చేయాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ కీలక నేతలంతా ఈ యాత్రలో పాల్గొంటారని భాజపా వర్గాలు చెబుతున్నాయి. 18 రోజుల్లో 108 అసెంబ్లిd నియోజక వర్గాలను చుట్టు ముట్టి రావాలని హైదరాబాద్‌ పరిధిలో ని జీహచ్‌ఎంసి పరిధిలో పెద్ద ఎత్తున ప్రచారానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement