హైదరాబాద్, ఆంధ్రప్రభ : బోగస్ కార్డుల ఏరివేతకు చేపట్టిన రేషన్ కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ముగింపు గడువు దగ్గరపడుతోంది. ఈకైవేసీ ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగియనున్నది. జనవరి 31తో సమయం ముగియనుండటంతో ఇంకా ఈకేవైసీ అప్‌డేట్ చేయించుకోని వారు వెంటనే పూర్తిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చాలా వరకు పాత రేషన్ కార్డుల్లో చనిపోయిన వారి పేర్లు, పెండ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిన ఆడపిల్లల పేర్లు అలాగే కొనసాగుతున్నాయి.
దీంతో రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నాయి. దీనిని అరికట్టేందుకు రాష్ట్రంలో గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా లబ్ధిదారుల నుంచి వేలిముద్రలను మళ్లీ సేకరిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు అక్కడి రేషన్ షాపుల్లోనే ఈ- కేవైసీ పూర్తిచేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 31తో కేవైసీ ప్రక్రియ ముగియనుంది. మరోసారి గడువు పెంచే అకాశం లేనట్లు తెలుస్తోంది.
కాగా.. ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ వేగంగా జరగకపోతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ లబ్దిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రేషన్‌కార్డుల ఈకేవైసీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆధార్ కేంద్రాల వద్ద ఉదయం ఆరుగంటల నుంచే టోకెన్‌ల కోసం లబ్దిదారులు నిరీక్షిస్తున్నారు. స్థానిక రేషన్ షాపుల్లో కొందరు లబ్దిదారుల వేలిముద్రలు జతకాకపోవడంతో ఆధార్ కేంద్రాలకు వెళ్లి అప్‌డేట్ చేయించుకున్నపటికీ ఈ కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడం లేదు.
ఆధార్ అప్‌డేట్ పూర్తి కాకపోవడంతోనే ఈకేవైసీ తీసకోవడం లేదని నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. దీంతో లబ్దిదారులు రోజుల తరబడ ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈకేవైసీ గడువును మరికొన్ని రోజులపాటు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.