ఉస్మానియాలో చూపులు కలిపి..
నాగార్జున సాగర్ లో మాటల కలిపి..
ఢిల్లీలో రాయబారం నడిపి..
జైపాల్‌రెడ్డిని ఒప్పించి…
కాబోయే మామను మెప్పించి
గీతని మనువాడిన కొత్త సిఎం …
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న రేవంత్‌రెడ్డి వ్యక్తిగత జీవితంలోనూ హీరోయిజమే ఉంది. ఇది ఆయన ప్రేమ పెళ్లి విషయంలో రుజువైంది. ఆయన విద్యార్థిగా ఉన్న దశలో హీరోయిక్ లవ్‌స్టోరీ ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. రెండుసార్లు వరుసగా అధికారంలో ఉన్న బలమైన బీఆర్‌ఎస్‌కు షాకిచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి ప్రేమకథ ఇప్పుడు తెలంగాణలోనే కాదు కర్ణాటక, ఏపీతోపాటు అటు ఢిల్లీ లో కూడా వైరల్ అవుతోంది. ఆయన ప్రేమ వివాహం వెనుక పెద్ద కథే ఉంది. అదీ రాజకీయపరమైన పెద్ద ఫ్యామిలీకి చెందిన అమ్మాయిది కావడంతో సహజంగానే ఇప్పుడు ఉత్కంఠ కల్గిస్తోంది.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఆయన ప్రేమకథ, ప్రేమ పెళ్లి హాట్ టాపిక్ అవుతోంది. ఉద్యమ నేత నుంచి రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి ప్రేమ వివాహం సినిమా స్టైల్లో ఉందని ప్రచారం జరుగుతోంది.
ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీ నాయకుడిగా ఓయూలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఉద్యమాలు నిర్వహించారు. స్టూడెంట్ లీడర్‌గా చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఈ క్రమంలో అప్పట్లో విద్యార్థిని అయిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి తమ్ముడి చిన్న కుమార్తె గీతారెడ్డితో రేవంత్ ప్రేమలో పడ్డారు. నాగార్జునసాగర్‌లో ఇద్దరూ మెుదటి సారి కలిశారు. అక్కడ మొదలైన పరిచయం మంచి స్నేహంగా, ఆ తరువాత ప్రేమగా మారిందట. మొదట రేవంత్ రెడ్డే ప్రొపోజ్ చేశాయగా.. ఆయన వ్యక్తిత్వం నచ్చడంతో గీతారెడ్డి కూడా వెంటనే ఓకే చెప్పేశారు.. అయితే ఈ ప్రేమ విషయం తెలిసిన గీతా తండ్రికి తెలిసింది..
తన కూతుర్ని వదులుకోవడం ఆ కుటుంబానికి ఇష్టం లేక తన కూతురిని ఢిల్లీలోని జైపాల్ రెడ్డి వద్దకు పంపించారు. అయినా రేవంత్ తగ్గలేదు. రాజకీయ ఒత్తిళ్లు కూడా వచ్చాయి. కానీ భయపడలేదు. రేవంత్ ఆ వెంటనే ఢిల్లీకి పయనమయ్యారు.. అదే జైపాల్ రెడ్డి ని ఒప్పించారు.. అతడితోనే గీత తండ్రికి రాయబారం నడిపి నేరుగా ఆయనను ఒప్పించారు. రేవంత్ రెడ్డిలో ఉన్న ధైర్యం, చురుకుదనం, ప్రతిభ చూసి జైపాల్ రెడ్డి తన తమ్ముడిని ఒప్పించారు. రేవంత్ ఎప్పటికైనా అత్యున్నత స్థాయికి చేరుకుంటాడని, రాజకీయాల్లో నిలదొక్కుకునే శక్తి ఉందని జైపాల్ గుర్తించారు. దీంతో తమ్ముడిని ఒప్పించి గీతారెడ్డిని రేవంత్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. ఇప్పుడీ ప్రేమ కథ వైరల్ గా మారింది.