మహబూబ్ నగర్, జులై 7 (ప్రభ న్యూస్): పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
ఆదివారం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 1003 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి పరిశీలించారు. అనంతరం మెడికల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ ఇంజనీరింగ్ అధికారి నిర్మాణ వివరాలు మ్యాప్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వారితో నిర్మాణ వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు.
సంవత్సరం చివరిలోగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తగా నిర్మాణం చేస్తున్న జనరల్ ఆసుపత్రి 1003బెడ్ లు, ఎం.సి.హెచ్ లో 220బెడ్ లు కలిపి మొత్తం 1225 బెడ్ లకు గాను అధనంగా డాక్టర్ లు, సిబ్బంది, టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్ లు, ఇతర సిబ్బంది అదనంగా 600 పైచిలుకు అవసరం వుంటుందని, ప్రభుత్వం అదనపు సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని గద్వాల, నారాయణ పేట, నాగర్ కర్నూల్ లో మెడికల్ కాలేజీల్లో అన్ని వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పి.హెచ్.సి, సబ్ సెంటర్, ఏరియా ఆసుపత్రులు, బోధన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని,సామాన్యులు సర్కార్ దవాఖానా నాది అనే విధంగా ఫీలింగ్ కల్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సారథ్యంలో కృషి చేస్తోందని, అన్ని ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు, మందులు, అదనపు సిబ్బంది, డైట్, ఇతరత్రా సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా ఈనెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిపై ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగంతో చర్చించి సాగునీటి ప్రాజెక్ట్ లు, విద్య, వైద్య రంగం, పర్యాటక రంగ అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తదితర అంశాలపై సమీక్ష చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట దేవరకద్ర శాసన సభ్యులు జి.మధు సూధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, జిల్లా ఎస్.పి.డి.జానకి, అదనపు కలెక్టర్ లు శివేంద్ర ప్రతాప్, ఎస్.మోహన్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కృష్ణ, జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.జీవన్, తదితరులు ఉన్నారు.