హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో సీజనల్ వ్యాధులతో పాటు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి లక్షణాలతో ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రధానమైన ఉస్మానియా, గాంధీ, ఫీవర్, ఎంజీఎం ఆస్పత్రుల్లో ఓపీ భారీగా నమోదవుతోంది. జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వైద్య చికిత్సల కోసం వచ్చే ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులలో ఓపీ ప్రతీరోజూ 2500 పైగానే ఉంటున్నది. ఈ ఆస్పత్రులకు వచ్చే రోగులలో 30 శాతానికి పైగా విష జ్వరాలతో బాధపడుతున్న వారే ఉండటం గమనార్హం.
ఇక నగరం నలుమూలల ఉన్న బస్తీ దవాఖానాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాగా, డెంగీ కేసులు కూడా ఇప్పుడిప్పుడే ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 400 డెంగీ కేసులు నమోదు కాగా, ఒక్క జూన్‌లోనే 120 నమోదైనట్లు వైద్య,ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో భారీగా వర్షాలు కురిసిన పక్షంలో రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్య చికిత్సలు అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.
మరోవైపు, ఉస్మానియా, ఆస్పత్రులకు ప్రస్తుతం వస్తున్న రోగులలో 30 శాతానికి పైగా రివ్యూ కోసం వస్తున్న వారే ఉంటున్నారు. వైద్య చికిత్సల కోసం ఒకసారి వైద్యులను సంప్రదించి తగ్గని పక్షంలో మరోమారు వైద్యుల వద్దకు వస్తున్నారు. దీంతో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులలో రివ్యూ కోసం వచ్చే రోగుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి వైద్యులు వారి ట్రాక్ రికార్డ్‌ను పరిశీలించి వెంటనే మందులు ఇస్తున్నారు. దీంతో సాధారణ వ్యాధులకు వైద్య చికిత్సల కోసం వచ్చే రోగులకు త్వరగా వైద్య చికిత్సలు అందించడానికి వీలు కలుగుతోంది.
ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది: డా.రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి
సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రాజారావు అన్నారు. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా మలేరియా, చికున్ గున్యా, డెంగీ వంటి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందనీ వీటి నుంచి రక్షించుకోవాలంటే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలనీ, వీటి ద్వారా ఈ వ్యాధులను కలిగించే దోమలు పుట్టకుండా నియంత్రించవచ్చన్నారు.
మలేరియా, డెంగీ, చికున్ గున్యా లక్షణాలు కనిపించినట్లయితే, వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలన్నారు. వైద్యులు ఈ వ్యాధులను నిర్ధారిస్తే అక్కడే వీటికి సంబంధించిన మందులతో కూడిన కిట్లు తీసుకోవాలనీ, వైద్యుల సూచనల మేరకు మందులు వాడుకుంటే మంచిదని పేర్కొన్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రికి ప్రతీ రోజూ 2500 వరకూ ఓపీ నమోదవుతున్నదనీ, రోగులకు వైద్య సేవలు అందించే విషయంలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా డా.రాజారావు వెల్లడించారు.