ఈటల రాజేందర్ కేవలం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను కాదు సీఎం కేసీఆర్ నే ఓడించారనే చర్చ జరిగింది. హుజురాబాద్ రిజల్ట్ తెలంగాణ రాజకీయాలను అంతలా ప్రభావితం చేసింది. అయితే హుజురాబాద్ ఎన్నికలప్పుడు ఈటల అభిమానులు, అనుచరులు, బీజేపీ శ్రేణులు గెలుపుకోసం కష్టపడటమే కాకుండా దేవుళ్లకు మొక్కులు కూడా మొక్కుకున్నారు. భారీ మెజారిటీతో ఈటల గెలవడంతో ఆ మొక్కులు ఇప్పుడు తీర్చుకుంటున్నారు.
తాజాగా కమలాపురం మండలం గూడూరు గ్రామానికి చెందిన ఈటల అనుచరుడు బండి వినయ్ సాగర్ వేములవాడ రాజన్నకు మొక్కు తీర్చుకున్నాడు. హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే ఈటల రాజేందర్ నిలువెత్తు బంగారం సమర్పిస్తానని వినయ్ రాజరాజేశ్వస్వామిని మొక్కుకున్నాడు. తాజాగా ఈ మొక్కును తీర్చుకున్నాడు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈటల రాజేందర్‌ను కలిసిన వినయ్ ఆయన బరువుతో సరితూగే బెల్లం సేకరించాడు. శుక్రవారం వేములవాడకు చేరుకుని రాజన్నను దర్శించుకుని ఈటలతో సరితూగిన 56కిలోల బెల్లంను (నిలువెత్తు బంగారం) స్వామికి సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు.