Tuesday, November 19, 2024

TS: విద్యను అభ్యసిస్తేనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు… అసదుద్దీన్ ఓవైసీ

నిజామాబాద్ సిటీ, జనవరి 10 (ప్రభ న్యూస్) : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని ఎంఐఎం జాతీయ అధ్యక్షులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఉర్దూ మీడియం 10వ తరగతి విద్యార్థినులకు ఆల్ ఇన్ వన్ మోడల్ పేపర్ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ… మీడియంలో చదువుకున్న విద్యార్థులు పదవ తరగతి వరకే విద్యను అభ్యసించి కళాశాలకు వెళ్లకుండా ఉంటున్నారన్నారు. పదవ తరగతికి పరిమితం కాకుండా ఇంటర్, డిగ్రీ చదివేందుకు ప్రభుత్వాలు అనేక మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాయ‌ని గుర్తు చేశారు. ఉర్దూ మీడియంలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిరుపేద విద్యార్థులు, విద్యార్థినులకు ఉర్దూ మీడియంలో విద్యను అభ్యసిం చేందుకు పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కోర్సులు నేర్చుకునేందుకు కూడా ఎంతో ప్రోత్సహిస్తుందన్నారు. సమాజంలో విద్యకు పోటీతత్వం బాగుందన్నారు.

ప్రస్తుత ఆధునిక యుగంలో విద్యార్థులు టీవీలకు, మొబైల్ లకు పరిమితం కాకుండా ఎప్పటికప్పుడు విద్యార్థులు ఎలా చదువుతున్నారనే విషయమై తల్లిదండ్రులు పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని, తద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నత స్థాయికి ఎదిగితే తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చిన వారవుతారన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముస్లింలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇందులో భాగంగానే మైనార్టీ విద్యార్థులకు అందజేయాల్సిన స్కాలర్ షిప్ లు తగ్గిస్తుందని మండిపడ్డారు. అనంతరం నాయకులు, కార్పోరేటర్లు ఓవైసీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షులు, భైంసా మున్సిపల్ చైర్మన్ జాబీర్ హైమద్, డిప్యూటీ మేయర్ ఇద్రిష్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు షకిల్ హైమద్, ఎంఐఎం కార్పోరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement