హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ ఐసెట్-21 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కౌన్సెలింగ్‌కు సంబంధించిన తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. వచ్చే నెల 3 నుంచి 9 వరకు స్లాట్ బుకింగ్, ధ్రువపత్రాల అప్‌లోడింగ్‌కు అవకాశం కల్పించారు.
అదే నెల 6 నుంచి 11వ తేదీ వరకు ధ్రువపత్రాలను పరిశీలన ఉంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఐసెట్ ఎంబీఏ, ఎంసీఏ మొదటి విడత సీట్లను నవంబర్ 14న కేటాయించనున్నారు. అదే నెల 14 నుంచి 18 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి, సీటు పొందిన కాలేజీల్లో విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ స్లాట్ బుకింగ్ నవంబర్ 21 నుంచి చేపట్టనున్నట్లు నవీన్ మిట్టల్ తెలిపారు. 22 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, 26న ఫైనల్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. 27 నుంచి 29 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు. 28వ తేదీన స్పాట్ అడ్మిషన్స్‌కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తామని తెలిపారు.