ఏదో ఒకటి చేసి తనను జైలులో పెట్టాలని చూస్తున్నారని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ అన్నారు. ఇటీవల తన నివాసాల్లో జరిగిన ఈడీ సోదాల విషయమై స్పందించారు. చెన్నూరులో బీఆర్ఎస్ అభ్యర్ధి బాల్క సుమన్‌కు ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు. ఆ భయంతోనే తనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారన్నారు. దీంతో సీఎం కేసీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేస్తే తన ఇండ్లపై ఈడీ సోదాలు నిర్వహించారని వివేక్ ఆరోపించారు. బీజేపీలో ఉన్నంత కాలం తనపై ఎలాంటి దాడులు జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరగానే దాడులు చేశారన్నారు. ఇప్పటివరకు కన్పించని తప్పులు ఇప్పుడే కన్పించాయా అని ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేసేందుకు బీఆర్ఎస్ , బీజేపీ యత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టపరంగానే వ్యాపారాలు..
తమ కుటుంబం చట్టపరంగానే వ్యాపారాలు చేస్తున్నదని వివేక్ అన్నారు. కాగా, రెండు రోజుల క్రితం గడ్డం వివేక్ నివాసాలు, ఆపీసుల్లో ఈడీ సోదాలు జరిపింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించింది. ఈ మేరకు ఫెమా ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్టుగా ఈడీ ప్రకటించింది. రెండు రోజుల క్రితం జరిగిన సోదాల గురించి ఈడీ ప్రకటన విడుదల చేసింది.