తెలంగాణలో ధర్మానికి అధర్మా నికి మధ్యలో యుద్ధం జరుగనుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగే సంగ్రామం కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలా ఉంటుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తన హుజూరాబాద్ నియోజక వర్గంలో ఈటల తొలిసారి పర్యటిస్తున్నారు. శంభునిపల్లి నుంచి కమలాపూర్ వరకు ఈటల రాజేందర్ ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎప్పుడు హక్కుల కోసం, నిరుద్యోగులకు కోసం పోరాటం చేస్తానని చెప్పారు. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఈ ఎన్నిక జరగబోతోందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు చైతన్య వంతమైన ప్రజలని పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే కాలంలో నా రాజీనామా అనంతరం వచ్చే ఉప ఎన్నికలో కేసీఆర్‌కు బుద్ధి చెప్పి తీరుతామన్నారని హెచ్చరించారు.
గొర్ల మందల మీద తొడేళ్లు పడ్డట్లుగా నా మద్దతు దారులపై దాడులు చేస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసినా, దాడులు చేసినా వారిని కొనలే ఈటల చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ కేంద్ర బిందువైతే ఆ కరీంనగర్‌ను కాపాడుకున్న ప్రాంతం హుజురాబాద్ అని అన్నారు. సంపూర్ణ మద్దతు తనకే ఇస్తామని ప్రజలు చెప్పారని తెలిపారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో యువత, నిరుద్యోగులు, ప్రైవేటు కార్మికులు, హక్కుల కోసం ఉద్యమిస్తోన్న వారు తనను ఆశీర్వదించారని తెలిపారు. హుజూరాబాద్ గెలుపే ఆత్మగౌరవంపై పోరాడుతున్న వారి గెలుపు అవుతుందన్నారు. ప్రగతి భవన్ కేంద్రంగా స్క్రిప్టులు రాసి ఇస్తే కొందరు తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తను గురించి తెలంగాణ ప్రజలకు తెలుసని, తనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వారే నష్టపోతారు తప్ప నాకేం జరగదని ఈటల చెప్పారు.