హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు సిటీ రోడ్లపై చక్కర్లు కొట్టనున్నాయి. ఈసారి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్, కేబుల్ బ్రిడ్జి మాత్రమే కాదు. డబుల్ డెక్కర్ బస్సులు కూడా ఇక మీదట గుర్తొస్తాయి. 1990వ దశకంలో పుట్టినవారు డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరిగిన జ్ఞాపకాలను ఇప్పటికీ యాది చేసుకుంటారు. మళ్లీ హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సుల్ని తీసుకురావాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది.
సిటీలో డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పాలని మంత్రి కేటీఆర్‌ని ట్విట్టర్‌లో నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పుతామని కేటీఆర్ హామీ కూడా ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు ప్రారంభించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కోరారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది.
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని నడపనుంది. అద్దెకు తీసుకొని నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సిటీలో మూడు వేర్వేరు రూట్లలో 10 ఇ-డబుల్ డెక్కర్ బస్సుల్ని అద్దెకు తీసుకొని నడపనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన టెండర్‌ను మరో వారంలో టీఎస్‌ఆర్‌టీసీ ఆహ్వానించనుంది.