Tuesday, January 7, 2025

e -car race scam – బిఆర్ఎస్ కు గ్రీన్ కో రూ.41 కోట్ల విరాళం… క్విడ్ ప్రో అంటూ ప్ర‌భుత్వం ఆరోపణలు

హైద‌రాబాద్ – ఫార్ములా-ఈ రేస్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను తెలంగాణ సర్కార్ బయటపెట్టింది. ఇందులో క్విడ్‌ ప్రోకో జరిగినట్టుగా ప్రభుత్వం తేల్చింది. బీఆర్ఎస్‌కు రూ.41 కోట్లను బాండ్ల రూపంలో గ్రీన్‌ కో సంస్థ ముట్టచెప్పినట్టు వెల్లడించింది ప్రభుత్వం. గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.41 కోట్లను గ్రీన్ కో కంపెనీ చెల్లించిందని.. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చినట్లు సమాచారం. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుంచే ఎన్నికల బాండ్లను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. 2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొనుగోలు చేసినట్లు సమాచారం.

కాగా, గ్రీన్‌కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ. కోట్ల ల‌బ్ధి చేకూరిన‌ట్లు కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గ్రీన్‌కో 2022లో ఎన్నిక‌ల బాండ్లు ఇచ్చిందని,. 2023లో ఫార్ములా ఈ రేసు జ‌రిగింద‌ని అన్నారు.. కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్‌కో బాండ్లు ఇచ్చింద‌న్న విష‌యాన్ని కెటిఆర్ గుర్తు చేశారు.. ఫార్ములా ఈ రేసు కార‌ణంగా గ్రీన్ కో న‌ష్ట‌పోయింద‌ని, దీంతో మ‌రుస‌టి ఏడాది రేస్ స్పాన్స‌ర్‌షిఫ్ నుంచి త‌ప్పుకుంద‌ని వివ‌రించారు.. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది..? ఇది రేవంత్ రెడ్డి టీం చేస్తున్న దుష్ప్ర‌చారమ‌ని పేర్కొన్నారు. పార్ల‌మెంట్ ఆమోదించిన ఎన్నిక‌ల బాండ్లు అవినీతి ఎలా అవుతుంద‌ని కెటిఆర్ నిల‌దీశారు.. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీకు వ‌చ్చిన బాండ్ల‌పై చ‌ర్చ‌కు సిద్ధం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement