కరెంటు కోతల వల్ల నాడు రైతులు అనేక కష్టాలు పడ్డారని, వేళాపాళా లేని కరెంటుతో పాముకాట్లకు గురై వందలాది మంది రైతులు మరణించారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ రూరల్ మండలంలోని చర్ల భుత్కుర్, తాహెర్ కొండాపూర్ గ్రామాలలో మంత్రి ప్రచారం నిర్వహించారు.
గ్రామాలకు వచ్చిన మంత్రి గంగుల మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలుకగా, డప్పు చప్పుళ్ళు మధ్య బీ ఆర్ ఎస్ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి తాను చేసిన అభివృద్ధిని వివరించి మరోసారి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ..హైదరాబాద్ రాష్ట్రం సంపాదను దోచుకునేందుకు… నాటి పాలకులు ధనిక రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్ర లో కలిపారని..సమైక్య పాలనలో మన బొగ్గును… దోచుకుని…గోదావరి జలాలను తరలించుకున్నారనీ..సాగు నీరు… కరెంట్ లేక అరిగోస పడ్డ రోజులు ఉండేవని గుర్తు చేశారు. కరెంట్ సమయానికి రాక పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన రైతులు ఎందరో అని ఆవేదన వ్యక్తంచేశారు. స్వయం పాలనలో సమస్యలు పరిష్కరించామని, కాళేశ్వరం జలాలతో తాగు సాగు నీటిని పరిష్కరించి మండుటెండల్లో చెరువులను మత్తడి దూకిస్తున్నామని అన్నారు.సియం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలతో కరెంట్ కష్టాలు లేకుండా పోయాయని, పుష్కలమైన నీటితో భూమికి బరువయ్యే పంటలు పండిస్తూ రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. పచ్చని తెలంగాణను చూస్తే ఆంద్రోళ్ళకు కంటగింపుగా ఉందని, మళ్ళీ తెలంగాణ పై విషం చిమ్ముతున్నారని..సినిమా స్టూడియోలు చూపించి… హైదరాబాద్ మా సంపద అంటున్నారని అన్నారు. తెలంగాణ వ్యతిరేకులైన మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి,షర్మిల, కెవిపిలు బిజెపి కాంగ్రెస్ ముసుగులో హైదరాబాదులో అడ్డావేశారని, తెలంగాణలో చిచ్చు పెట్టమని పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు పంపించారని అన్నారు. వీరంతా కలిసి కెసిఆర్ ను ఓడగోట్టేందుక గుడుపుఠాని చేస్తున్నారని, కెసిఆర్ ను ఓడించి తెలంగాణ ను ఆంధ్రాలో కలిపి గుడ్డిదీపం చేస్తారని అన్నారు. మన తాతలు తప్పు చేస్తే 50 సంవత్సరాలు దరిద్రాన్ని చూశామని…మనం తప్పు చేస్తే మన భవిష్యత్ తరాలు గోస పడుతాయనీ ..తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టొద్దని పిలుపునిచ్చారు.ఎన్నికల వేళ మరోసారి ఆశీర్వదించాలని కాంగ్రెస్ బిజెపి నాయకులు వస్తున్నారనీ…వారు ఎన్నికలప్పుడే కనిపించి మాయమవుతారని అన్నారు. భూకబ్జా కేసులున్న రౌడీ షీటర్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని..ఆయనను గెలిస్తే మన భూములను కబ్జా చేస్తారని అన్నారు. ఎంపిగా గెలిచిన తర్వాత బండి సంజయ్ ఎప్పుడైనా కనిపించాడా అని అన్నారు. కెసిఆర్ సిఎంగా లేని తెలంగాణ ఊహించుకోలేమని భయంకరంగా ఉంటుందనీ, కుక్కలు చింపిన విస్తరి చేస్తారు అని అన్నారు. తెలంగాణను దోపిడీ చేసేందుకు శత్రువులు రెడీగా ఉన్నారని కర్ణాటక ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ దని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ను నమ్మొద్దని అక్కడి ప్రజలు చెబుతున్నారని..వారికి ఓటు వేసి గెలిపిస్తే గోస తప్పదని ఓటు వేసే ముందు ఆలోచించాలని కోరారు. యాభై ఏళ్ల దరిద్రానికి కారణమైన కాంగ్రెస్ బిజెపిల పట్ల తస్మాత్ జాగ్రత్త అని అన్నారు. సాగు నీరు, కరెంట్ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, మరోసారి తనను గెలిపిస్తే మరింత గొప్పగా పని చేస్తానని అన్నారు.