హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎనిమిది రోజులుగా కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు రైసు మిల్లుల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లినట్లు మిల్లర్లు వాపోతున్నారు. ఈ యాసంగిలో కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. అయితే మిల్లుల్లో పూర్తి ధాన్యాన్ని వర్షానికి తడవకుండా నిల్వ చేసేందుకు సరిపోను గోదాము సౌకర్యం లేకపోవడంతో ఆరుబయట ధాన్యాన్ని నిల్వ ఉంచారు. భారీ వర్షాలకు రైసు మిల్లుల్లో ఉన్న 94లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో దాదాపు 10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసి ముద్దయిందని వాపోతున్నారు. ఎఫ్‌ఏ క్యూ నిబంధనలకు, సీఎంఆర్ డెఇలవరీకి ఇది సరిపోదని వాపోతున్నారు. ఎఫ్‌సీఐ అధికారులు బియ్యం సేకరణను నెల రోజులుగా నిలిపివేయడంతో మిల్లుల్లో ఆరుబయటే ధాన్యం నిల్వ ఉంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ పరిస్థితుల్లో గడిచిన ఎనిమిది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ధాన్యం మొత్తం తడిసి మొలకెత్తి కోట్లలో నష్టం వాటిల్లందని తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు తడిసిన ధాన్యం మొలకెత్తుతోందని మిల్లర్లు వాపోతున్నారు. రాష్ట్రంలోని 3200 రైసు మిల్లుల్లో ఇదే పరిస్థితి నెలకొందని తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎఫ్‌సీఐ ద్వారా తెలంగాణ నుంచి బియ్యం సేకరణను చేపట్టాలని కోరుతున్నారు. మరో నాలుగు నెలల్లో ఖరీఫ్ ధాన్యం కూడా వచ్చే పరిస్థితులు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సీఎంఆర్‌కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.