Thursday, October 24, 2024

KTR | రైతుల పట్ల కాంగ్రెస్, బీజేపీల ద్వంద్వ వైఖరి..

నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : గుజరాత్ రాష్ట్రంలో క్వింటాలు పత్తికి రూ.8800 ధర చెల్లిస్తుంటే… తెలంగాణ రైతులకు 7 వేల పైచిలుకు మద్దతు ధర మాత్రమే ఇస్తున్నారని… ఇది న్యాయమేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలను ఒకే మాదిరిగా చూడడం లేదని తన సొంత రాష్ట్రం గుజరాత్ పై ఉన్న ప్రేమ తెలంగాణపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ఆదిలాబాద్ ఎంపీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గుజరాత్ తరహా మద్దతు ధర సాధించకపోతే ఆ తప్పంతా బిజెపి ఎంపి ఎమ్మెల్యేలదేనని ఆయన వ్యాఖ్యానించారు.

వరికి మద్దతు ధరతో పాటు బోనస్ ఇచ్చే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. రైతుల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా తాము పోరాటం చేస్తామని ప్రకటించారు. దిలావర్ పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి జనావాసాలకు రైతు వ్యవసాయ క్షేత్రాలకు దూరంగా స్థలం చూపిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్యాయం జరిగేలా ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. ఆ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

పది సంవత్సరాలపాటు అధికారం అనుభవించి తమ పార్టీని కొంతమంది సీనియర్లు వదిలిపెట్టి వెళ్లినా… తమ పార్టీకి ఎలాంటి ధోకా లేదని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement