Thursday, November 21, 2024

BREAKING : తెలంగాణ డీఎస్సీ నోటీఫికేష‌న్ విడుద‌ల‌.. మార్చ్ 4నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసారు.

11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ద్వారా మొత్తం 11,062 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)-6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2,629 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్-727, పీఈటీలు-182, స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు స్పెషల్ కేటగిరీ విభాగంలో ఉన్నాయి. 5,089 పోస్టులతో గతేడాది సెప్టెంబర్ 6న విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఫిబ్రవరి 28 రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాత పోస్టులకు కొత్త ఖాళీలను జోడిస్తూ కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అయితే పాత దరఖాస్తులే చెల్లుబాటు అవుతాయని, కొత్త డీఎస్సీని పరిశీలిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇప్పటికే ప్రకటించారు. అంటే పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు.

ఫిబ్రవరి 28న డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ విడుదల చేయాలని అధికారులు భావించినా షెడ్యూల్‌, సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌ తుది మెరుగులు దిద్దాల్సి ఉండటంతో వాయిదా పడింది. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వాటితోపాటు కొత్త పోస్టులను కూడా చేర్చి డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో ఇప్పటికే 4 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. వారంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రశ్నాపత్రాల నుంచి ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే సాఫ్ట్ వేర్ రూపకల్పనపై మరింత శ్రద్ధ పెట్టారు. పాస్‌వర్డ్‌లు, ఆన్‌లైన్ సిస్టమ్ భద్రతను సీనియర్ అధికారులు సమీక్షిస్తారు. సాంకేతిక రంగంలో ప్రయివేటు కంపెనీల పాత్ర పోషిస్తున్నందున విద్యాశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కీలక పాత్ర పోషిస్తున్న అధికారులు ప్రతి అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement