నిజామాబాద్ ప్రతినిధి, జనవరి 7(ఆంధ్రప్రభ ) : పసుపు రైతులు మార్కెట్ యార్డుకు ఆరబెట్టిన పసుపును మాత్రమే తీసుకువచ్చి సహకరించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కోరారు. పసుపుని పూర్తిగా ఎండబెట్టిన తర్వాతనే మార్కెట్ యార్డ్ కు తీసుకోవచ్చేలా పసుపు రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహించే ప్రచార యాత్రను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పసుపు రైతులకు అవగాహన ప్రచార యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రచారయాత్రను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ… పసుపు రైతులకు అవగాహన కల్పించేందుకు ఆదిలాబాద్, నిజా మాబాద్, కరీంనగర్ జిల్లాలో రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రచార యాత్ర వాహనాలు బయలుదేరినట్లు తెలిపారు. పసుపు పండించే రైతులు పసుపుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోరారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పచ్చి పసుపు అమ్మకం నిషేదించడమైందన్నారు. పచ్చి పసుపు మార్కెట్ యార్డుకు తీసుకురావడం ద్వారా సరియైన మద్దతు ధర రాక రైతు నష్టపోయే అవకాశం ఉందన్నారు. పూర్తిస్థాయిలో సుమారు 15రోజులు ఆరబెట్టిన తర్వాత పసుపుని మార్కెట్ యార్డ్ కు తీసుకురావడంతో రైతులు అధిక లాభం పొందే అవకాశం ఉందన్నారు.
పసుపు పండించే రైతులు సహకరించాలని కోరారు. జాతీయస్థాయిలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి చాలా ప్రత్యేకత ఉందన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి గత పాలకుల హయాంలో పూర్తిస్థాయిలో పాలకవర్గం లేక పూర్తిగా నిర్వీర్యమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి చైర్మన్ ముప్పా గంగారెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ది ఇందూర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బాదావత్ తారాచంద్ నాయక్, మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ కిషోర్, మల్లేష్, మాస్టర్ శంకర్, సీనియర్ కాంగ్రెస్ నాయ కులు శేఖర్ గౌడ్, మునిపల్లి సాయి రెడ్డి, నరస గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.