Friday, November 8, 2024

Drunk and drive | మందుబాబుకు రెండు రోజుల ట్రాఫిక్ డ్యూటీ !

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులకు షాక్ ఇస్తూ పెద్దపల్లి న్యాయమూర్తి మంజుల తీర్పు నిచ్చారు. శుక్రవారం వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డ 20 మందిని పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు.

విచారించిన న్యాయమూర్తి మంజుల 20 మందికి 23 వేల రూపాయల జరిమానా విధించారు. అయితే అత్యధికంగా మద్యం సేవించి వాహనం నడిపిన కమాన్పూర్ కు చెందిన ఇందాక రమేష్ కు 500 రూపాయల జరిమానాతో పాటు సామాజిక సేవలో భాగంగా రెండు రోజులపాటు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని తీర్పునిచ్చారు.

శని, ఆదివారాల్లో రమేష్ ట్రాఫిక్ విధుల్లో ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇకపై తరచు వాహనాల తనిఖీలు నిర్వహిస్తామని పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ తెలియజేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement