హైదరాబాద్, ఆంధ్రప్రభ : పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ సరఫరా జరిగినట్లు ఆధారాలు దొరికాయని పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన డీసీపీ ఈవెంట్ మేనేజర్ అనిల్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందన్నారు. అయితే క్లబ్ నిర్వాహకుడు అభిషేక్ ఉప్పల పాత్ర ఏ మేరకు ఉందన్నది తేలాల్సి ఉందన్నారు. ప్రస్తుతం వీరిద్దరినీ అరెస్టు చేశామని, అర్జున్ వీరమాచినేని పరారీలో ఉన్నారని, అతడి కోసం గాలిస్తున్నామన్నారు. క్లబ్‌లో అర్థరాత్రి దాటాక కూడా పార్టీ జరుగుతుందని, పార్టీలో పాల్గొన్న వారిలో కొంత మంది డ్రగ్స్ తీసుకున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేశారన్నారు. పార్టీలో పాల్గొన్న వారిలో దాదాపు 35 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోందని, డ్రగ్స్ సేవించిన వారెవరు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న వివరాలను రాబట్టాల్సి ఉందన్నారు.
పార్టీని ఏర్పాటు చేసిన నిర్వాహకులు అత్యంత పకడ్బంధీగా ఈ వ్యవహారం నడిపినట్లు గుర్తించామన్నారు. పబ్‌కు ఎవరు రావాలన్న అంశంతో పాటు పార్టీలో పాల్గొనే వారందరికీ ఒక్కో కోడ్ ఇచ్చారని, పబ్‌లో జరిగే పార్టీలో పాల్గొనేందుకు వచ్చిన వారందరూ ముందుగా ఓటీపీ ద్వారా వచ్చిన కోడ్‌ను చెప్పి లోనికి ప్రవేశించారన్నారు. పార్టీలో దాదాపు 150 మంది వరకు పాల్గొన్నారని, అందరూ డ్రగ్స్ తీసుకున్నారని ఇప్పుడే చెప్పలేమని, అయితే కొంత మంది మాత్రం డ్రగ్స్ తీసుకున్నారని తేలిందన్నారు. కొంత మంది డ్రింక్‌లో డ్రగ్స్‌ను వేసుకుని తాగారని తేలిందన్నారు. పబ్‌లో నుంచి అయిదు కొకైన్ ప్యాకెట్లను సీజ్ చేశారని, వీటిల్లో అయిదు గ్రాముల కొకైన్ ఉందని చెప్పారు.
కౌంటర్‌లో డ్రగ్స్ ఉంచి విక్రయించినట్లు తేలిందన్నారు. డ్రగ్స్ తీసుకున్న వారెవరైనా సరే వదిలే ప్రసక్తి లేదన్నారు. అరెస్టు చేసిన వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందని, త్వరలోనే డ్రగ్స్ తీసుకున్న వారిని విచారిస్తామన్నారు. పబ్‌లోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ట్యాబ్ అనాలసిస్‌ను కూడా సీజ్ చేశామని వివరించారు. ఇటీవలే పబ్ మేనేజ్‌మెంట్ మారిందన్నడీసీపీ పబ్‌లో ఎప్పటి నుంచి డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి, ఎన్ని ఈవెంట్లు జరిగాయి, ఎవరెవరు హాజరయ్యారన్న అంశాలను కూడా పరిశీలించాల్సి ఉందన్నారు.
డెకాయ్ అపరేషన్ జరిగినపుడు క్లబ్ నిర్వాహకులు ఏ మాత్రం సహకరించలేదని, క్లబ్‌ను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కొంత సమాచారం వెల్లడించారన్నారు. డ్రగ్స్ సరఫరాలో ఒక్క అనిల్‌కుమార్ మాత్రమే ఉన్నారా లేక మరికొంత మంది ఉన్నారా అన్న అంశాలతో పాటు డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తెప్పించారన్న అంశాలను కూడా తేల్చనున్నామన్నారు.