హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ వ్యాప్తంగా యథేచ్ఛగా కొనసాగుతున్న నకిలీ ఔషధాల దందాపై తెలంగాణ ఔషధ నియంత్రణ(డీసీఏ)శాఖ కొరఢా ఝులిపిస్తోంది. యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి నకిలీ మందులను తెప్పించి అమ్ముతున్న అక్రమార్కులు కొందరైతే… మరికొందరు హైదరాబాద్‌లోనే నకిలీ మందుల తయారీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
ఆర్‌ఎంపీ వైద్యులు, ఆన్‌లైన్‌లో ఈ నకిలీ మందులను రోగులకు అంటగడుతున్నారు. రెండు నెలలుగా రాష్ట్రంలో నకిలీ ఔషధాల అమ్మకాలపై ఔషధ నియంత్రణశాఖ దాడులు జరుపుతోంది. నెల రోజుల్లోనూ కోట్ల విలువైన నకిళీ ఔషధాలను సీజ్ చేశారు. నకిలీ ఔషధాల కారణంగా రోగులకు వ్యాధి తగ్గకపోగా కొత్త రోగాలువస్తున్నాయి. నకిలీ మెడిసిన్, ప్యాకేజీ కోసం బ్రాండెడ్ మెడిసిన్ లోగోలను, పేర్లను అక్రమార్కులు వినియోగిస్తున్నారు.
తీక్షణంగా పరిశీలించి చూస్తే తప్ప నకిలీ ఔషధం అని గుర్తుపట్టలేనంతగా నాణ్యమైన మందుల బ్రాండ్ల పేర్లను వినియోగిస్తున్నారు. చాక్‌పీస్ పౌడర్, మక్కపిండి, ఆలుగడ్డ పిండితో నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు డీసీఏ తనిఖీల్లో తేలింది. బీపీ, షుగర్ ఔషధాలతోపాటు కేన్సర్, గుండె జబ్బుల చికిత్సలో వినియోగించే ఔషధాలు కూడా నకిలీవి మార్కెట్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయంటే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఎక్కువ ధరలకు ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు: డీజీ కమలహాసన్‌రెడ్డి
రాష్ట్రంలో నకిలీ ఔషధ మాఫియా పెట్రేగిపోతుండడంతో నాణ్యమైన ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకే రోగులకు ఔషధాలను విక్రయించాలని మెడికల్ షాపులను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ కమల్ హాసన్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన మందులు సరఫరా అయ్యేలా చూడటం డ్రగ్ కంట్రోల్ అధికారులగా తమ బాధ్యత అని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నామన్నారు.
గత 6 నెలల నుండి నకిలీ మందుల పై నిఘా పెంచామని తెలిపారు. గడిచిన 6 నెలల్లో నకిలీ మెడిసిన్ ఇంజక్షన్స్ సీజ్ చేసామన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నకిలీ మందులను తయారు చేసి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. ఉత్తర ఖాండ్, హిమాచల్‌ప్రదేశ్ కేంద్రంగా నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. అలా ఇతర రాష్ట్రాల్ర నుండి కొరియర్, ఎజెంట్ల ద్వారా హైదరాబాద్‌కు దిగుమతి చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో 42 వేల మందులు షాప్‌లు ఉన్నట్లు తెలిపారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులపై నిఘా పెంచామన్నారు. గడిచిన ఆరు నెలల నుంచి మంచి ఫలితాలొస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. రోడ్డు రవాణా ద్వారా నకిలీ ఔషధాలను కొరియర్ చేస్తున్న ముఠాలను పట్టుకున్నామన్నారు. వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్‌లో వచ్చే నకిలీ మందులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇందుకు డ్రగ్ కంట్రోల్ శాఖ ప్రత్యేకంగా వెబ్ సైట్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు నకిలీ మందులు గుర్తించి తమకు సమాచారం అందించాలని కోరారు. తక్కువ ధరలకు మందులు ఇస్తున్నారని డిస్కౌంట్ల పేరుతో మోసపోకండని సూచించారు. ఎలాంటి సమాచారం ఉన్నా వెబ్ సైట్ లోని టోల్ ఫ్రీ నంబర్ కి సమాచారం అందించాలన్నారు.